ఎండలకు బండి భద్రం
♦ అశ్రద్ధ తగదు రక్షణ చర్యలు చేపట్టాలి
♦ అప్పుడే ఎక్కువ రోజులు మన్నిక
ఘట్‌కేసర్ టౌన్: వేసవిలో భానుడి ప్రతాపానికి ప్రాణాలు అరచేతపట్టుకుని తిరగాల్సి వస్తోంది. ఎండవేడికి శరీరం మండుతుంటుంది. ఉక్కపోతకు ఒంటిలోని నీరంతా ఆవిర వుతుంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటాం. రోజూ ప్రయాణించే ద్విచక్ర వాహన విషయానికొస్తే ఆ.. బైకే కదా అని వదిలేస్తుంటారు. బైక్‌లకు కూడా తీవ్ర ఎండల నుంచి కాస్తంత రక్షణ కల్పించాలంటున్నారు మెకానిక్‌లు. లేదంటే ఆయిల్ ఎక్కు వగా ఖర్చవడం, ఇంజిన్‌లో రిపేరులు ఏర్పడడం తదితర సమస్యలు ఎదురవు తాయంటున్నారు. మొత్తంగా బైక్ లైఫ్ టైమ్ తగ్గిపోతుందంటున్నారు.
పాటించాల్సిన జాగ్రత్తలు
♦ వాహన ఇంజిన్ ఆయిల్ ఎండ వేడికి త్వరగా పలచనవుతుంది. నిర్ణీత సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం ఎంతైనా అవసరం. ఎండాకాలం మొదలవగానే ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం శ్రేయస్కరం.
♦ పెట్రోలు ట్యాంకుపై మం దపాటి కవర్ ఉండేటట్టు చూసు కోవడం వల్ల కొంత వరకు పెట్రోలు ఆవిరి కాకుండా తగ్గించుకోవచ్చు. సాధారణ సీటు కవర్లు త్వరగా వేడెక్కుతాయి. ఇది మన ఆరోగ్యానికి కూడా హానికరం. వేడెక్కకుండా ఉండే సీటు కవర్లు అందుబాటులో ఉన్నాయి. వెల్వెట్, పోస్టు క్లాత్ వంటివి వాడడం మంచిది.
♦ టైర్లు ఎక్కువ అరిగి ఉంటే కొత్తవి మార్చుకోవాలి. ట్యూబ్‌లకు పంక్చర్లు ఎక్కువగా ఉంటే వేసవిలో ట్యూబులు మార్పించడం మంచిది. మధ్యాహ్నం ఎండలో ఎక్కువ సమయం పార్కింగ్ చేసి ఉంచితే వాహన జీవితకాలం తగ్గుతుంది.
♦ వేసవిలో ఇంజిన్ గార్డు తొలగించడం మంచిది. దూర ప్రయాణమైతే బస్సుల్లోనే వెళ్లడం ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో వాహనం తీయాల్సి వస్తే మధ్యమధ్యన విరామం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంజిన్ వేడి తగ్గుతుంది.
♦ వేసవిలో ట్యాంకులో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. రాత్రి వేళ ఒకసారి ట్యాంకు మూత తీసి మళ్లీ పెడితే మంచిది. దీంతో గ్యాస్ బయటకు పోయి ఆయిల్ సులువుగా ఇంజిన్‌లోకి వెళ్తుంది.
♦ మధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు బండి నిలిపితే రంగు త్వరగా వెలిసిపోతుంది. పెట్రోలు ఆవిరైపోతుంది.
♦ వేసవిలో సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ద్విచక్రవాహనంపై ప్రయాణం చేయకపోవడం ఉత్తమం.
♦ ఉదయం 8 గంటలకు ముందు సాయంత్రం 6 గంటల తర్వాత పెట్రోల్ పోయించుకోవాలి.
♦ ఎండ నుంచి బండిని కాపాడుకోవడానికి సాధ్యమైనంత వరకు నీడపట్టున నిలపాలి.
వాహనాలను కాపాడుకోవాలి..
వేసవిలో తగు జాగ్రత్తలు పాటిస్తే బైక్ ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. ఎండ నుంచి వాహనాలను రక్షించు కోవడానికి బైక్‌లకు నాణ్యమైన కవర్లను వినియోగిం చాలి. ఎండ వేడిమికి టైర్లు పగిలిపోయే అవ కాశముంది. రంగులు కోల్పోయి వెలసిపోతాయి. సాధ్యమై నంత వరకు వాహనాలను నీడలో నిలపడం ఉత్తమం. ఇంటి ముందు మధ్యాహ్నం వేళల్లో నీడలో పెట్టడానికి అవ కాశం లేకపోతే మందపాటి టార్ఫాలిన్ కప్పడంతో రక్షణ కల్పించాలి. - కొమ్మిడి జైపాల్‌రెడ్డి, మెకానిక్