ఏపీ సీఎం కార్యాలయంలో సూరీడు
సాక్షి, విజయవాడ బ్యూరో: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సూరీడు గురువారం ఏపీ సీఎం కార్యాలయానికి వెళ్లారు. 3గంటలకుపైగా సూరీడు సీఎం కార్యాలయంలోనే ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చాలాసేపు భేటీ అయినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్రను కూడా సూరీడు కలిసినట్లు తెలిసింది. తిరిగివెళ్లేటప్పుడు ఆయన సీఎం కార్యాలయం మెయిన్ గేటు నుంచి బయటకు రాకపోవడం అనుమానాలకు తావిచ్చింది.
సూరీడు కోసం మీడియా బయట వేచి ఉండడంతో మంత్రులు పుల్లారావు, అచ్చెన్నాయుడు నడుచుకుంటూ బయటకు వచ్చి మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ మెయిన్‌గేటు వరకూ వెళ్లారు. ఆ సమయంలో వెనుక గేటు నుంచి సూరీడును బయటకు పంపించారు. మీడియాను పక్కదారి పట్టించేందుకు మంత్రులు ఇలా బయటకు నడుచుకుంటూ రావడం ఆశ్చర్యం కలిగించింది. 2009లో డాక్టర్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత ఇప్పటివరకూ ఎక్కడా కనిపించని సూరీడు ఇంతకాలానికి బాబు క్యాంపు కార్యాలయంలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది.