సీఎం అధికార నివాసం వద్ద హైడ్రామా
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార నివాసం వద్ద సోమవారం రాత్రి రాజకీయ హైడ్రామా కొనసాగింది. రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలు, భారీ అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేక్రమంలో ఫిరాయింపు రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు విపక్ష పార్టీకి చెందిన ఐదుగురు ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఓవైపు తెలంగాణలో టీఆర్ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యేల చేరికలను గర్హిస్తున్న ఆయనే.. విపక్ష ఎమ్మెల్యేలను తన నివాసానికి పిలిపించుకుని రహస్యంగా మంతనాలు సాగించారు.
కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ, కడప జిల్లా జమ్మలమగుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డిలు సోమవారం రాత్రి చంద్రబాబుతో భేటీఅయినవారిలో ఉన్నారు. సోమవారం మధ్యహ్నం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి రాజీనామాచేసిన అనంతరం భూమా తన కూతురుతో కలిసి విజయవాడలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మరికాసేపటికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ లు కూడా బాబుతో భేటీ అయ్యారు. కాగా, ఆదినారాయణ రెడ్డి చేరతారనే ఊహాగాలను ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మలు తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్లను పార్టీలో చేర్చుకుంటే తమదారి తాము చూసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు సర్దిచెప్పడంతో చివరికి కాస్త మెత్తబడ్డట్లు తెలిసింది.