-
ప్రోటోకాల్‌లో సర్పంచులకు సర్కారు మరో ఝలక్
-
జాతీయ పతాకావిష్కరణలో సంప్రదాయానికి గండి
-
జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులకు పెద్దపీట
-
జిల్లాలో గ్రూపులుగా అధికార పార్టీ నాయకులుl
-
‘ఆహ్వానం’ పంపడంలో ఎంఈవో, హెచ్‌ఎంలకు తలనొప్పి!
స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పతాకావిష్కరణ... ప్రజాప్రతినిధులంతా ఆ గౌరవం కోసం తహతహలాడుతుంటారు! జిల్లా కేంద్రం మినహా మిగతా ఎక్కడైనా ఆ గౌరవం ఇప్పటివరకూ గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కే సొంతం. తమ పరిధిలోని ఏ పాఠశాలలోనైనా స్వాతంత్య్ర దినోత్సవం నాడు వారే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఇప్పటి వరకూ వస్తోన్న సంప్రదాయం. దీన్ని ‘రాజకీయ కోణం’లో చూస్తూ టీడీపీ సర్కారు దానికి గండికొట్టింది. కొత్తగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను తెరపైకి తీసుకొచ్చింది. హైస్కూళ్లు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో జాతీయ పతాకావిష్కరణ వారికి అప్పగించింది. ఇప్పటికే జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో నియమించిన టీడీపీ కార్యకర్తల హల్‌చల్‌తో సర్పంచులు నిమిత్తమాత్రులయ్యారు. ఈ కొత్త సంప్రదాయం ఎంఈవోలు, ప్రధాన ఉపాధ్యాయులకు తలనొప్పి తీసుకొస్తోంది. జిల్లాలో అధికార పార్టీ నాయకులు గ్రామగ్రామాన గ్రూపు రాజకీయాలు పెంచిపోషిస్తుండటంతో ఎవ్వరిని ఆహ్వానిస్తే ఏం కొంప మునుగుతోందని మల్లగుల్లాలు పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జిల్లాలో 470 ఉన్నత పాఠశాలలు, 567 ప్రాథమికోన్నత పాఠశాలలు, సుమారు 2,300 ప్రాథమిక పాఠశాలలున్నాయి. అలాగే జిల్లాలో 38 మంది జెడ్పీటీసీ సభ్యులు, ఎనిమిది ఖాళీలు పోను 667 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా.. సర్పంచులు 1,099 మంది ఉన్నారు. అయితే ఇప్పటివరకూ అన్ని పాఠశాలల్లోనూ వాటి పరిధిలోని సర్పంచులే స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పతాకావిష్కరణ చేసేవారు. అయితే గత స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ మంది సర్పంచులు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులే గెలుపు సాధించారు. నాటి నుంచి వారి సర్పంచుల అధికారాలకు గండి కొట్టే ప్రయత్నాలు టీడీపీ ప్రభుత్వం మొదలెట్టింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలు వంటి స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన అధికారాలను ఒక్కొక్కటిగా దూరం చేస్తూ వచ్చింది. జన్మభూమి కమిటీలు ఆ కోణంలో వచ్చినవేనన్న విమర్శలు గురించి అందరికీ తెలిసిందే.
నాటి గౌరవమేదీ?
కుల, ఆదాయ, స్థానిక ధ్రువీకరణ పత్రాలకు సిఫారసు చేయాలన్నా, రేషన్ కార్డుల నుంచి బ్యాంకు రుణాల వరకూ, పింఛనుల నుంచి సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల జాబితాలు రూపొందించాలన్నా సర్పంచులదే కీలక పాత్ర. గ్రామంలో ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా ప్రోటోకాల్ ప్రకారం సర్పంచే అధ్యక్షత వహిండం.. లేదంటే ఆధ్వర్యం వహించాలి. కానీ ఆ గౌరవానికి గత రెండేళ్లుగా టీడీపీ ప్రభుత్వం భంగం కలిగిస్తూనే వస్తోంది. జన్మభూమి కమిటీల సభ్యులకే సర్పంచుల అధికారాలన్నీ కట్టబెట్టేసింది. ఇప్పుడు పార్టీ గుర్తుపై గెలిచిన ప్రాదేశిక సభ్యులకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
‘ఆహ్వానం’ పంపడానికి తర్జనభర్జన
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి హైస్కూల్‌లోనూ జాతీయ పతాకావిష్కరణకు జెడ్పీటీసీ సభ్యుడునే ఆహ్వానించాలి. జనాభాను బట్టి ఒక్కో మండలంలో ఏడు నుంచి పది వరకూ హైస్కూళ్లు ఉన్నాయి. అంటే ఒక్కో జెడ్పీటీసీ సభుయడు ఏడు నుంచి పది చోట్ల జాతీయ పతాకాలను ఆవిష్కరించాల్సి ఉంది. మండలం అంతా తిరిగి ఆయా హైస్కూళ్లలో పతాకాలను ఆవిష్కరించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి కార్యక్రమాలన్నీ ముగించేసరికి రోజంతా సరిపోద్ది. ఏదిఏమైనా జాతీయ పతాకాన్ని ఉదయం 11 గంటలలోపే ఆవిష్కరించాలి. కొన్ని పంచాయతీల్లో ఎంపీటీసీ సభ్యులు ఇద్దరు, కొన్నిచోట్ల ముగ్గురు కూడా ఉన్నారు. కానీ యూపీ స్కూల్ మాత్రమే ఒక్కటే ఉంది. అక్కడ ఎవ్వరిని ఆహ్వానించాలనే విషయంపై స్పష్టత లేదు.
టీడీపీ గ్రూపులతో తలనొప్పి వేరయా...
జిల్లాలో ప్రధానంగా మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌లు వేర్వేరుగా గ్రూపులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాలవారీగా కూడా నాయకుల మధ్య గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో కార్యకర్తలే కాదు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులున్నారు. రాజాం నియోజకవర్గంలో కిమిడి కళా వెంకటరావు, మంత్రి అచ్చెన్నాయుడితో పాటు ఎమ్మెల్సీ ప్రతిభాభారతి మూడో గ్రూపు నిర్వహిస్తున్నారు. పాతపట్నంలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుతో పాటు ఇటీవల పార్టీలోకి ఫిరాయించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గ్రూపుల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. శ్రీకాకుళంలో స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి గ్రూపు, మంత్రి అచ్చెన్నాయుడి గ్రూపు, ఎచ్చెర్లలో కళా వెంకటరావు గ్రూపు, మంత్రి అచ్చెన్నాయుడు గ్రూపుల మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పుడు ప్రతి నాయకుడు జాతీయ పతాకావిష్కరణ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. ఒకే స్కూల్ పరిధిలో ఇద్దరు ముగ్గురు నాయకులున్నచోట ఎవ్వరిని ఆహ్వానించాలో తెలియక ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు తలలుపట్టుకుంటున్నారు.
గతంలోనూ చంద్రబాబుది ఇదే తీరు...
2004 సంవత్సరానికి పూర్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడానికి, సర్పంచుల హక్కులను కాలరాయడానికి చేయని ప్రయత్నం లేదు. వాటిని అడ్డుకోవడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు చేశాం. అందుకే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారు. కానీ 2014 ఎన్నికల సమయంలో మాత్రం తానెంతో మారానని ప్రజలను మాయచేసి అధికారంలోకి వచ్చారు. ఆ మార్పు మంచి కోసం ఉండాలి. కానీ తిరోగమనంలో వెళ్తోంది. స్థానిక సంస్థలకు రాజ్యాగం నిర్దేశించిన విధివిధానాలు ఉన్నాయి. వాటిని ఇష్టానుసారం మార్చుకుంటూ పోవడం హాస్యాస్పదం.
– ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సర్పంచులూ... హక్కుల కోసం గళమెత్తండి
రాష్ట్రపతి తర్వాత చెక్‌పవర్ ఉన్న ఏకైక పదవి గ్రామ సర్పంచ్ ఒక్కటే. గ్రామానికి ప్రథమ పౌరులనే గౌరవం సర్పంచులదే. కేవలం టీడీపీ కార్యకర్తలతో నింపేసిన జన్మభూమి కమిటీలతో ప్రభుత్వం ఇప్పటికే వారినే అవమానించింది. ఇప్పటి వరకూ పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్‌లను కాదని, ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు ఆ గౌరవం కల్పించడం సమంజసం కాదు. అలాగని వీరిని అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. ఎంతో కష్టతరమైన గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రత్యక్షంగా ఎన్నికైన సర్పంచ్‌కు తగిన గౌరవం కల్పించాలనేదే డిమాండు. అలాంటి గౌరవానికి భంగం కలిగిస్తే సర్పంచులు ఎలా బుద్ధి చెబుతారో ప్రభుత్వానికి తర్వాత తెలిసివస్తుంది. తమ హక్కుల రక్షణకు సర్పంచులు ఇప్పటికైనా ప్రభుత్వానికి నిరసనగళం వినిపించాలి.
– తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు