
పనులు పూర్తికాకుంటే సస్పెండే
♦ పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి
♦ బహిరంగ వేదిక నుంచే మంత్రి హరీశ్‌రావు సమీక్ష
పాపన్నపేట: స్థలం : పెద్ద చెరువు (బాచారం, పాపన్నపేట మండలం)
సందర్భం : మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా గుండువాగు శంకుస్థాపన
విషయం : బహిరంగ సభలో వేదిక పైనుంచి సమీక్ష సమావేశం
మిషన్ కాకతీయ పనులను మంత్రి హరీశ్‌రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వానాకాలం సమీపిస్తుండడంతో పనులు తొందరగా పూర్తి చేయించాలన్న కచ్చితమైన లక్ష్యంతో ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పాపన్నపేట మండలం బాచారం గ్రామంలో శుక్రవారం గుండువాగు పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చిన మంత్రి హరీశ్ బహిరంగ వేదిక నుండే ఇరిగేషన్ అధికారులు ఈఈ యేసయ్య, డిప్యుటీ ఈఈ శివ నాగరాజు, జేఈ కుషాల్‌తో సమీక్ష నిర్వహించారు.
మంత్రి: మెదక్ నియోజకవర్గంలో మిషన్ కాకతీయ మొదటి ఫేజ్ కింద 165 పను లు మంజూరు అయితే ఇంకా పూర్తి కాలేదు.
ఈఈ : సార్, మొత్తం 165 పనుల్లో 109 గ్రౌండ్ చేశాం. 23 అగ్రిమెంట్ కాలేదు. 34 పనులు ప్రారంభం కాలేదు.
మంత్రి: ఇంకెప్పుడు చేస్తారు. ఏం ముహూర్తాలు కుదరడం లేదా. వర్షాకాలం వచ్చాక చేస్తారా?
అధికారి: ఈ నెలాఖరు కల్లా పూర్తి చేస్తాం
మంత్రి: అగ్రిమెంట్‌లో ఆలశ్యం ఎందుకు? ఎస్‌ఈతో మాట్లాడండి
డిప్యుటీ ఈఈ : మాట్లాడుతాం సార్
మంత్రి: నర్సాపూర్‌లో కూడా ఇంకా 82 పనులు అసంపూర్తిగా మిగిలాయి.
ఈఈ: అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం సార్
మంత్రి: రాష్ట్రంలో ఖమ్మం మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ ఎందుకు పనులు సాగడం లేదంటే ఖమ్మం జిల్లాకు ఆంధ్రా నుండి జేసీబీలు వస్తున్నాయంటున్నారు. ఇక్కడ జేసీబీలు లేవంటున్నారు.
ఈఈ: లేదు సార్ పూర్తి చేస్తాం.
మంత్రి : వచ్చే మృగసిర కల్లా పనులు పూర్తి చేయక పోతే జేఈలను సస్పెండ్ చేస్తా. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి: ముప్పై ఏళ్లుగా నానుతున్న గుండు వాగు పనిని డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అడిగారు. వెంటనే రూ.1.08 కోట్లు మంజూరు చేశా. బుల్లెట్ లాంటి కాంట్రాక్టర్ దొరికాడు. ఈ పనిని కూడా నెల రోజుల్లో పూర్తి చేయించాలి. అంటూ సమీక్ష ముగించారు.