
ప్రైవేట్ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ దోపిడీ
హైదరాబాద్‌కు చెందిన ఐ.సురేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వారం రోజులు దాటినా దగ్గు, జలుబు, తలనొప్పి తగ్గకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు.
పరీక్షల పేరుతో వేలకు వేలు గుంజుతున్న వైనం
పరిస్థితి విషమించడంతో చివరకు గాంధీలో చేరుతున్న దుస్థితి
స్వైన్‌ఫ్లూను నియంత్రించడంలో సర్కారు విఫలం
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన ఐ.సురేశ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వారం రోజులు దాటినా దగ్గు, జలుబు, తలనొప్పి తగ్గకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. స్వైన్‌ఫ్లూ అనుమానంతో నాలుగు రోజులు వివిధ రకాల పరీక్షలు చేశారు. వ్యాధి నిర్ధారణ కాలేదు గానీ జ్వరం తగ్గడంతో డిశ్చార్జ్ చేశారు. వైద్యానికి ఆయనకు వేసిన బిల్లు.. రూ. 40 వేలు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి విపరీతమైన తలనొప్పి, జలుబుతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. స్వైన్‌ఫ్లూ అనుమానంతో అనేక రకాల పరీక్షలు చేశారు. 3 రోజులు చికిత్స చేసినా తగ్గకపోవడంతో చివరకు ఆస్పత్రి వర్గాలు చేతులెత్తేశాయి. గత్యంతరం లేక ఆయన్ను గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. చివరకు పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. 3 రోజులు ఆ కార్పొరేట్ ఆస్పత్రిలో ఉంచినందుకు రూ. 35 వేలు బిల్లేశారు.
ఇలా స్వైన్‌ఫ్లూ లక్షణాలతో వచ్చే వ్యక్తులకు ప్రైవేట్ ఆస్పత్రులు భారీ బిల్లులతో చుక్కలు చూపిస్తున్నాయి. చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరే రోగులకు ఉచిత పరీక్షలు చేయాలని.. మందులివ్వాలని వైద్యారోగ్య శాఖ గతంలో ఆదేశించినా పట్టించుకోకుండా నిలువునా దోపిడీ చేస్తున్నాయి. వ్యాధి నిర్ధారణకు నమూనాలు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పంపించాలని చెప్పినా పెడచెవినపెట్టి డబ్బులు దండుకుంటున్నాయి.
స్వైన్‌ఫ్లూ అనుమానిత బాధితులకు రక్త పరీక్షలు చేసే వరకు ఆగకుండా తక్షణమే చికిత్స ప్రారంభించాలని కోరినా పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉంచినట్లు వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్నా అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. స్వైన్‌ఫ్లూ రోజురోజుకూ విజృంభిస్తోంది.
లోపించిన ప్రచారం...
2015లో స్వైన్‌ఫ్లూపై విస్త్రృత ప్రచారం జరిపిన ప్రభుత్వం ఈసారి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. గతంలో మంత్రిమండలి సమావేశం నిర్వహించి స్వైన్‌ఫ్లూ నియంత్రణకు అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. కానీ ఈసారి ప్రజలను చైతన్యపరచడంలో సర్కార్ విఫలమవుతోంది. ప్రజలను చైతన్యం చేసేందుకు కరపత్రాలు, వాల్ పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాల్సి ఉన్నా చర్యలు కానరావడం లేదన్న విమర్శలున్నాయి.