ఉల్లాసంగా ఊయలలూగి..
పిట్టలవానిపాలెం: అట్లతద్దె పండుగను పురస్కరించుకొని మండలానికి చెందిన యువతులు మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది వివాహం అయిన మహిళలకు తమ పుట్టింటి వద్ద అట్లతద్దె పండుగను పురస్కరించుకొని వాయినాలు తీర్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. వాయినాలకు ముందు మహిళలు ఉపవాసం ఉండి గౌరి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రకాల పూలతో అమ్మవారికి అభిషేకం చేసిన అనంతరం గ్రామపెద్దల సమక్షంలో వాయినాలు తీర్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘ఇచ్చితినమ్మా వాయినం... పుచ్చుకుంటినమ్మా..’ వాయినం అంటూ మహిళలు, ముతైదువలు వాయినాలు తీర్చుకోవడంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. అదేవిధంగా అట్లతద్దె సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉయ్యాలలు ఏర్పాటుచేసి మహిళలను ఊపటం గ్రామస్తుల ఆచారం. సంప్రదాయాన్ని మరువరాదనే ఉద్దేశంతో ప్రధానంగా మండలంలోని కొత్తపాలెం శివారు పరిశవారిపాలెం, ఖాజీపాలెం శివారు కప్పలవారిపాలెంలో గ్రామాలలో గ్రామస్తులు తాడిచెట్లకు ఉయ్యాల ఏర్పాటు చేశారు.