షాపులో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలి
Published Fri, Nov 18 2016 12:41 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
కర్నూలు(రాజ్‌విహార్): నగదు, చిల్లర సమస్య పరిష్కారం కోసం వ్యాపార, వాణిజ్య సంస్థల్లో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ మల్లేశ్వర కుమార్ సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకుల ఖాతాల్లో జమచేసుకున్నట్లు వెల్లడించారు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు, చేతిలో రూ.2వేల నోట్లు ఉన్నప్పటికీ చిల్లర సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని పరిష్కరించేందుకు నగదు రహిత వ్యాపారాలు, లావాదేవీలు జరిగేలా చూడాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఈక్రమంలో ప్రతి షాపు, వ్యాపార దుకాణ యజమానులందరూ తప్పనిసరిగా స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వీటిని ఆయా దుకాణదారులు తమ ఖాతా ఉన్న బ్యాంకుల్లో ఉచితంగా పొందవచ్చన్నారు. దీని పర్యవేక్షణకు కర్నూలు నగరంలో కార్మిక శాఖతోపాటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, గ్రామీణ ప్రాంతాల్లో తమ అధికారులతోపాటు డీఆర్‌డీఏ ఉద్యోగులు షాపులకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తారన్నారు.
Advertisement