వైఎస్‌నగర్‌పై కక్ష్య సాధింపు | take revange on ysr nagar | Sakshi
Sakshi News home page

వైఎస్‌నగర్‌పై కక్ష్య సాధింపు

Published Fri, Jul 7 2017 12:07 AM | Last Updated on Fri, Aug 10 2018 8:26 PM

వైఎస్‌నగర్‌పై కక్ష్య సాధింపు - Sakshi

వైఎస్‌నగర్‌పై కక్ష్య సాధింపు

- వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని నిధులు కేటాయించని వైనం
- స్థానికుల నరకయాతన
నంద్యాల: మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆవిర్భవించిన వైఎస్‌నగర్‌పై ప్రభుత్వం కక్షసాధింపునకు పాల్పడుతోంది. కాలనీ ఓటర్లు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని, ఉప ఎన్నికల్లో కూడా అదే పార్టీకి వేస్తారని భావించిన అధికార పార్టీ నేతలు నిధుల కేటాయింపుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో రూ.2వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం అభివృద్ధి పనుల విషయంపై వైఎస్‌నగర్‌పై వివక్ష చూపుతోందని కాలనీవాసులు వాపోతున్నారు. వైఎస్సార్సీపీ జెండాపై గెలిచిన కౌన్సిలర్‌ శివశంకర్‌ అధికార పార్టీలో చేరినా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. వైఎస్సార్‌ సీఎం ఉన్న 2006లో 6500 పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. వీటిని నందమూరినగర్‌ పక్కన ఉన్న 200 ఎకరాల్లో అన్ని వర్గాల పేదలకు కేటాయించారు. 5వేల కుటుంబాలు ఈ కాలనీలో నివాసం ఉన్నాయి. వైఎస్‌ హయాంలో నిర్మితమైన రెండు నీళ్ల ట్యాంకులు, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులు మినహా ఇతర  అభివృద్ధి పనులే లేకపోవడం గమనార్హం. 
 
వైఎస్సార్సీపీకి పట్టం కట్టిన స్థానికులు.. 
వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి చలువ వల్ల తలదాచుకోవడానికి ఇల్లు దొరికిందనే భావనతో స్థానికులు గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు పట్టం కట్టారు. మున్సిపాలిటీ, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా పార్టీ అభ్యర్థులకే ఓటు వేసి వైఎస్సార్‌పై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు. అప్పటి నుంచి వైఎస్‌నగర్‌ పార్టీకి పెట్టని కోటగా మారింది. 
 
‍కానరాని అభివృద్ధి..
వైఎస్‌నగర్‌ ఓటర్లు వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిస్తుండటంతో అధికార పార్టీ నేతలు కాలనీ అభివృద్ధిని విస్మరించారు. భూమా నాగిరెడ్డి ఏడాదిన్నర క్రితం అధికార పార్టీలో చేరినా కాలనీని పట్టించుకోలేదు. భూమా మృతి తర్వాత ఉప ఎన్నికల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. అయితే వైఎస్‌నగర్‌ వాసులు ఎలాగూ తమకు ఓట్లు వేయరని భావించి కాలనీకి నిధులు కేటాయించలేదని స్థానికులు చెబుతున్నారు. 
 
సమస్యలను పరిష్కరించలేని కౌన్సిలర్‌..
స్థానిక కౌన్సిలర్‌ శివశంకర్‌యాదవ్‌ సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆయన 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గెలిచారు. వైఎస్సార్‌పై ఉన్న అభిమానంతో స్థానికేతరుడైనా కాలనీవాసులు గెలిపించారు. కాని ఆయన గత ఏడాది ఫిబ్రవరిలో ఎమ్మెల్యే భూమాతో పాటు అధికార పార్టీలో చేరారు. అధికార పార్టీలో ఉన్నా, వైఎస్‌నగర్‌కు ఎలాంటి సేవలందించడం లేదన్న భావన ప్రజల్లో ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement