శిలాఫలకం వేస్తున్న ఈవో సాంబశివరావు, చైర్మన్ కృష్ణమూర్తి
తిరుపతి సిటీ: మన పూర్వీకులు మనకు అందించిన ఆధ్యాత్మిక కళాసంపదను భావితరాలకు అందించాలని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ నమూనా ఆలయం వద్ద బుధవారం శ్రీవెంకటేశ్వర భక్తిచానల్ నూతన స్టూడియో, పరిపాలనా భవనాలకు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తిరుపతిలో మొట్టమొదటిసారిగా అన్ని వసతులతో కూడిన స్టూడియోను నిర్మిస్తుదన్నారు. తద్వారా కళాకారులకు అద్భుత అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఎస్వీబీసీ ప్రసారాలకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తున్నదని, కార్యక్రమాలను మరింత నాణ్యంగా రూపొందించాలని ఆయన కోరారు. ఈవో సాంబశివరావు మాట్లాడుతూ శ్రీవారి కార్యక్రమాలను, ధర్మప్రచారానికి ఎస్వీబీసీ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. త్వరలో ఎస్వీబీసీ తమిళ చానల్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. శ్రీవేంకటేశ్వర భక్తిచానల్ నూతన స్టూడియో, పరిపాలనా భవనాలను రూ.14.50 కోట్లతో 4525.36 మీటర్ల విస్తీర్ణంలో మూడు అంతస్తులతో నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్లు సుధాకర్‌యాదవ్, భానుప్రకాష్‌రెడ్డి, చీప్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్వీబీసీ సీఈవో నరసింహరావు, ఎస్‌ఈ రమేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.