ఎరక్కపోయి వచ్చాము.. ఇరుక్కుపోయాము..
పుణ్యం కోసం భగవంతుడి వద్దకు వెళితే పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తణుకువాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తేదీన తణుకు నుంచి కోడూరి మురళీకృష్ణ (గోల్డ్‌స్పాట్ మురళి), చిట్టూరి అచ్యుతరామ ప్రసాద్, వట్టికూటి నాగ మోహనరావు, ఫణి, సత్యప్రసాద్ కాశీకి వెళ్లారు
తణుకు అర్బన్ : పుణ్యం కోసం భగవంతుడి వద్దకు వెళితే పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని తణుకువాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 4వ తేదీన తణుకు నుంచి కోడూరి మురళీకృష్ణ (గోల్డ్‌స్పాట్ మురళి), చిట్టూరి అచ్యుతరామ ప్రసాద్, వట్టికూటి నాగ మోహనరావు, ఫణి, సత్యప్రసాద్ కాశీకి వెళ్లారు. బుధవారం ఉదయం వారణాసిలో భగవంతుడిని దర్శించుకుని వచ్చే సందర్భంలో హోటల్‌లో రూ.500 నోటు చెల్లదని చెప్పడంతో విస్తుబోయినట్టు ఫోన్ ద్వారా మురళి, ఫణి ఇక్కడ బంధువులకు ఫోన్‌లో తెలిపారు. చిల్లర సమస్యతో కాశీలో చిక్కుకున్న వారి ఆవేదన వారి మాటల్లోనే..
’రాత్రికి రాత్రే పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంఖ్యలో తెలుగు వారు ఇక్కడకు వచ్చి ఉన్నారు, వారంతా ఆటో కిరాయిలు, హోటల్‌లో భోజనం కొనుగోలుకు చిల్లర లేక అవస్థపడుతున్నారు. రూ.500 నోటుకు రూ.200 తీసుకుని రూ.300 ఇవ్వమన్నా కుదరదంటున్నారు. కొనుక్కునే స్తోమత ఉన్నా చిల్లర మారక ఇబ్బందులు పడుతున్నాం. ఉన్న చిల్లర నోట్లు ఖర్చయి పోగా మా వద్ద ప్రస్తుతం రూ.500, రూ.1000 నోట్లు మాత్రమే మిగిలాయి. గురువారం మధ్యాహ్నానికి ముందుగానే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, కానీ అప్పటివరకు వాటర్ బాటిల్‌కు కూడా తికానా లేని పరిస్థితి. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసిలో ప్రస్తుతం రూం తీసుకుని ఉన్నాం. పస్తులుండి ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నా అక్కడ నుంచి రావడం కూడా కష్టం. ఏదో కరువు వచ్చినట్టుగా ఇక్కడంతా అల్లకల్లోలంగా ఉంది.’