– కొలువుల పేరుతో యువతుల తరలింపు
– తిరుపతి కేంద్రంగా వ్యాపారం
– నెల రోజుల కిందట 15 మంది సౌదీ అరేబియాకు..
పల్లె పడుచులే లక్ష్యం
– వ్యభిచార ముఠాల గుప్పిట్లో చిక్కుకుని విలవిల
– బాధిత కుటుంబాల ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తం
– తిరుపతి ఏజెంటు రాణిమ్మను అదుపులోకి తీసుకుని విచారణ
వారానికోసారి పల్లెటూళ్లకు వెళతారు. బాగున్న యువతులను మాటల్లోకి దించుతారు. చదువుకున్నా, లేకున్నా విదేశాల్లో ఉద్యోగం అంటారు. నెలకు రూ.50 వేలకు పైగా సంపాదనంటారు. భవిష్యత్తు మీద బోలెడు ఆశలు రేపుతారు. ఎలాంటి భయం లేదని భరోసా ఇస్తారు. నమ్మకంగా విదేశాలకు తీసుకెళ్తారు. అక్కడున్న వ్యభిచార ముఠాలకు విక్రయిస్తారు. ఇదీ జిల్లాలో వెలుగు చూస్తోన్న దారుణాలు. నిన్నామొన్నటి వరకూ చిత్తూరు, సత్యవేడుల్లో వెలుగు చూసిన ఈ తరహా మోసాలు నేడు తిరుపతిలోనూ కనిపిస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
నిన్నా మొన్నటి వరకూ చిత్తూరు, సత్యవేడు ప్రాంతాల్లో ఈ తరహా మోసాలు వెలుగు చూశాయి. తమిళనాడుకు చెందిన రఫీ, పాండియన్‌లనే ఇద్దరు ఏజెంట్లు సుమారు 150 మంది మహిళలను విదేశాలకు పంపారు. సత్యవేడుకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేశారు. రఫీ, పాండియన్‌లను అరెస్టు చేశారు. కాగా ఈ తరహా మోసాలు, మహిళల అక్రమ తరలింపులు తిరుపతిలోనూ వెలుగు చూశాయి. దీంతో అర్బన్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ముఠాల కోసం గాలిస్తున్నారు.
తిరుపతి నుంచి ఇలా...
పూతలపట్టు మండలం డీ మిట్టూరుకు చెందిన వెంకట రమణ, తిరుపతికి చెందిన వెటశాల శ్రీనివాసరావులు మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తిరుపతికి చెందిన కొందరు మహిళల తరలింపు ఏజెంట్లు తమ తమ భార్యలను ఏ విధంగా విదేశాలకు తీసుకెళ్లారో వివరించి అక్కడి వ్యభిచార కూపాల్లో మహిళలు అనుభవిస్తోన్న నరక యాతనను వివరించారు. వారు తెలియజేసిన వివరాలు వారి మాటల్లోనే....
నా భార్యను రక్షించండి...
మాది పూతలపట్టు మండలం డి. మిట్టూరు గ్రామం. కొన్నాళ్లుగా భార్యాపిల్లలతో తిరుపతి మంగళం రోడ్డులో ఉంటున్నాం. పక్కనే ఉన్న రాణిమ్మ పరిచయమైంది. దుబాయ్‌కి వెళితే నెలకు రూ.1 లక్ష సంపాదన ఉంటుందనీ, అక్కడి ఇళ్లల్లో పనిచేస్తే నెలవారీ జీతం వస్తోందని ఆశ చూపింది. ఇందుకోసం ఖర్చవుతుందని చెపితే రూ.50 వేలు చెల్లించాం. ఆగస్టు 12న నా భార్య అమతతో పాటు మరో 14 మంది మహిళల్ని తీసుకుని రేణిగుంటలో రైలెక్కారు. మూడ్రోజులు ముంబయి హోటల్లో ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత ఎటు నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. 15 రోజుల తర్వాత సౌదీకి తీసుకెళ్తున్నారని ఫోన్‌లో చెప్పింది. తిరిగి ఈ నెల 17న మళ్లీ ఫోన్‌లో మాట్లాడింది. అక్కడ తనను హింసిస్తున్నారనీ, వ్యభిచారం చేస్తేనే ఉంటావనీ, లేకుండా ప్రాణాలతో ఉంచబోమని బెదిరిస్తున్నారని ఏడ్చింది. ఏం చేయాలో తెలియక ఆదివారం సాయంత్రం అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాం. వాళ్లు రాణిమ్మను పట్టుకొచ్చారు. విచారణ చేస్తున్నారు. ఎలాగైనా నా భార్యను రక్షించండి.
== పీ వెంకట రమణ, తిరుపతి.
––––––––––––––
నా భార్యను రూ.2 లక్షలకు అమ్మేశారట...
మేం తిరుపతిలోని మంగళం రోడ్డులో ఉంటాం. మేం కూడా రాణిమ్మ చేతిలోనే చిక్కాం. నా భార్య క్రిష్ణకుమారి కూడా సౌదీ అరేబియా ముఠా చేతుల్లో చిక్కుకుంది. ఆగస్టు 24న ఢిల్లీలో విమానం ఎక్కించారు. నన్ను కూడా విదేశాలకు తీసుకెళ్తామని నమ్మించిన ముఠా సభ్యులు ఢిల్లీ వెళ్లాక నన్ను వెనక్కి పంపి నా భార్యను మాత్రమే విమానం ఎక్కించారు. వీసా ఆలస్యం కాబట్టి రెండ్రోజుల తరువాత నన్ను పంపుతామన్నారు. నేను వెనక్కి తిరిగొచ్చాను. ఈ నెల 17న నా భార్య నుంచి ఫోన్ వచ్చింది. అక్కడ తాను చాలా ఇబ్బందుల్లో ఉందని తెల్సింది. తనను రూ.2 లక్షలకు అమ్మేశారని చెప్పింది. ఆ డబ్బులు తెచ్చి ఇస్తేనే వదులుతారని చెప్పింది. ఇల్లుగానీ, బంగారం గానీ ఏదో ఒకటి అమ్మి తనను కాపాడాలని ఏడుస్తూ ప్రాథేయపడింది. నా భార్యతో పాటు ఆరోజు సుమతి, అమత, ఇంకా 13 మందిని తీసుకెళ్లారు. తమిళనాడుకు చెందిన ముఠా సభ్యుడు మీరాభాయ్ కూడా వెంట వెళ్లాడు. ఇక్కడున్న రాణిమ్మను విచారిస్తే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి.
== వీ. శ్రీనివాసరావు, తిరుపతి.
––––––––––––––––
విచారణ జరుపుతున్నాం
మహిళల రవాణా గురించి తెల్సింది. ఎక్కడెక్కడ ఎంత మందిని విదేశాలకు పంపారో గుర్తిస్తున్నాం. అసలు మహిళల్ని ఎలా ట్రాప్ చేశారో, బాధితులు, ముఠా సభ్యుల మధ్య పరిచయాలు ఎలా మొదలయ్యాయే తెల్సుకుంటున్నాం. ఇటీవలనే ఈ తరహా కేసు మరొకటి నమోదైంది. అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నాం. ఎవర్నీ వదలం.
== జయలక్ష్మి, అర్బన్ ఎస్పీ, తిరుపతి.