ఫన్‌టైమ్స్‌ను టార్గెట్ చేసిన కార్పొరేటర్లు
రూ.10 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు
టీడీఆర్ బాండ్ల సమగ్ర దర్యాప్తు అవశ్యం
విజయవాడ : కార్పొరేషన్లో టీడీఆర్ బాండ్ల మంజూరు అంశం చినికిచినికి గాలివానలా మారింది. ఫన్‌టైమ్స్ క్లబ్ రోడ్డు విస్తరణకు సంబంధించి బాండ్ల మంజూరులో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ కార్పొరేటర్లు ముప్పా వెంకటేశ్వరరావు, గండూరి మహేష్ కౌన్సిల్‌లో రచ్చచేశారు. ప్రశ్నను ఉపసంహరించుకోవాలంటూ తనకు 16 బెదిరింపు కాల్స్ వచ్చాయని మహేష్ సభ సాక్షిగా చెప్పారు. సీన్‌కట్ చేస్తే మహేష్ తనను బ్లాక్‌మెయిల్ చేశారని, ఇందుకు సంబంధించి తనవద్ద ఆధారాలు ఉన్నాయని ఒలిపింక్ అసోసియేషన్ జిల్లా గౌరవ కార్యదర్శి కె.పి.రావు ప్రత్యారోపణలకు దిగారు.
ఇదీ సంగతి...
పటమట ఫన్‌టైమ్స్ క్లబ్ రోడ్డును మాస్టర్‌ప్లాన్ ప్రకారం 80 అడుగుల రోడ్డుగా విస్తరించాలని 1998లో కౌన్సిల్ నిర్ణయించింది. 2,080 చ దరపు గజాల స్థలం అవసరమని అంచనా వేశారు. కార్పొరేషన్‌కు స్థలాన్ని ఇచ్చేందుకు 11మంది ప్రైవేటు వ్యక్తులు నిరాకరించారు. 2002లో నాటి కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ బలవంతంగా స్థల సేకరణకు ప్రయత్నించగా ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో స్థలసేకరణకు బ్రేక్‌పడింది. స్థల యజమానులతో చర్చల అనంతరం 2011లో డీల్ కుదిరింది. 2,080 చదరపుగజాల్లో 520 చదరపు స్థలాన్ని ఉచితంగా, మిగిలిన స్థలానికి అదే ఖరీదు గల స్థలాలు ఇవ్వాల్సిందిగా మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్(ఎంవోయూ) కుదిరింది.
ఈ ప్రకారం 310, 356,626 చదరపు గజాల స్థలాలను మూడు ముక్కలుగా కార్పొరేషన్ స్థల యజమానులకు మంజూరు చేసింది. ఇంకా 268 చదరపుగజాల స్థలాన్ని కార్పొరేషన్ బాకీ పడింది. ల్యాండ్‌వ్యాల్యూ మార్కెట్ ప్రకారం యజమానులు ఇచ్చిన స్థలం అప్పట్లో గజం రూ.33 వేలు ఉండగా, బదులుగా కార్పొరేషన్ ఇచ్చిన స్థలం గజం కేవలం రూ.17 వేలు మాత్రమే ఉంది.
ఈ రెంటికి మధ్య ధర వ్యత్యాసం రూ.1.57 కోట్లు వచ్చింది. ఇందుకు రెట్టింపు మొత్తంలో బాండ్లు పంపిణీ చేయాలన్నది ఒప్పందం. 268 చదరపు గజాల స్థలం, మార్కెట్ వ్యాల్యూ ప్రకారం వచ్చిన తేడా ప్రకారం 1,321.60 చదరపు గజాలకు సంబంధించిన బాండ్లను కార్పొరేషన్ పంపిణీ చేసింది. దీంతో డీల్ ముగిసింది.
మళ్లీ తెరపైకి....
ఐదారేళ్ల క్రితం సమసిపోయిన ఈ వివాదాన్ని టీడీపీ కార్పొరేటర్లు వ్యూహాత్మకంగా కౌన్సిల్‌లో చర్చకు తెలచ్చారు. బాండ్ల పంపిణీలో కిరికిరి జరిగిందని ఆరోపించారు. నగరంలో వందల సంఖ్యలో బాండ్ల పంపిణీ జరిగితే ఫన్‌టైం క్లబ్‌రోడ్డు బాండ్లను మాత్రమే టార్గెట్ చేయడం ఇక్కడ కొసమెరుపు. రికార్డు అంతా పక్కగానే ఉందని సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్ స్పష్టం చేసినప్పటికీ కార్పొరేటర్లు తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయని చెప్పిన మహేష్ సభలో గందరగోళం సృష్టించారు.
కుంభకోణాన్ని ఛేదించాలన్నదే టీడీపీ కార్పొరేటర్ల అభిమతం అయితే కేపీరావుతో హోటల్లో చర్చలు ఎందుకు జరిపారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బెదిరింపు కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో దర్గా భూముల తీర్మానం, శ్రీ కనకదుర్గ లేఅవుట్ సొసైటీ వ్యవహారంలో అవినీతి మకిలి అంటించుకున్న టీడీపీ పాలకులపై తాజాగా బ్లాక్‌మెయిలర్స్ ముద్ర పడింది. సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ముప్పా కబ్జాకోరు
ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా గౌరవ కార్యదర్శి కేపీరావు
టీడీపీ కార్పొరేటర్లు బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఫన్‌టైమ్స్ క్లబ్ రోడ్డుకు బాండ్ల మంజూరుపై కుంభకోణం జరిగిందని అనవసరపు రాద్ధాంతం చేశారు. 47వ డివిజన్ కార్పొరేటర్ గండూరి మహేష్ కౌన్సిల్‌లో పెట్టిన ప్రశ్నను ఉపసంహరించుకునేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేశారు.
43వ డివిజన్ కార్పొరేటర్ కొండపల్లి అనసూయ భర్త సత్యనారాయణ మధ్యవర్తిత్వం చేశారు. ఓ స్టార్ హోటల్లో నాతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తా’’ అంటూ ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.పి.రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బాండ్ల మంజూరుపై సీబీసీఐడీ విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. 42వ డివిజన్ కార్పొరేటర్ ముప్పావెంకటేశ్వరరావు డెరైక్షన్లోనే మహేష్ యాక్షన్ చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సెంట్రల్ నియోజక వర్గ ఎమ్మెల్యే బొండా ఉమా దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు.
మహేష్ తరుపున కొండపల్లి సత్యనారాయణ తనకు చేసిన ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తే బండారం బయటపడుతోందన్నారు. కౌన్సిల్‌కు ఐదు రోజుల ముందు హోటల్ మురళీ ఫార్చ్యున్‌లో తనను కల్సి బ్లాక్‌మెయిల్ చేశారన్నారు.
హోటల్‌లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే కార్పొరేటర్ వచ్చాడో లేదో తెలుస్తుందన్నారు. కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు కబ్జాకోరు అని కేపీరావు విమర్శించారు. హోటల్ నారాయణస్వామి పక్కనే ఉన్న 200 గజాలు కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకున్నారని పేర్కొన్నారు. మేయర్ కోనేరు శ్రీధర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కేవీ.రావు దుయ్యబట్టారు.
ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నుంచి క్రీడాసంఘాలను బయటకు పంపాలని ప్రయత్నిస్తే తాను అడ్డుకున్నానన్నారు. మూడు రోజుల క్రితం మేయర్‌ను కలిసి తనకే ఇంకా కోటి రూపాయల విలువైన బాండ్లు రావాల్సి ఉందని చెప్పానని, బాండ్ల మంజూరు ప్రశ్నపై కౌన్సిల్‌లో చర్చించవద్దని తానేమీ ప్రాథేయపడలేన్నారు.