టీడీపీలో చేరకపోతే అంతు చూస్తాం
వైఎస్‌ఆర్ సీపీ నాయకులకు మంత్రి సోదరుడి బెదిరింపు
అనంతపురం : పార్టీ ఫిరాయించాలని, లేకుంటే అంతు చూస్తామంటూ రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలను టీడీపీ నాయకులు బెదిరించారు. తమ మాట వినకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందంటూ హెచ్చరించారు. ఇందులో భాగంగా పోలీసులను రంగంలోకి దింపి ఒత్తిళ్లు పెంచారు. రాప్తాడు మండలం యర్రగుంటలో చెరువు స్థలాన్ని టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన కొందరు సాగు చేసుకుంటున్నారు. వారం క్రితం వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు నరసింహారెడ్డి భూమి నుంచి మట్టిని తోలేందుకు టీడీపీ నేత నారాయణస్వామి సిద్ధమయ్యాడు. అతని చర్యలను నరసింహారెడ్డి అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నారాయణస్వామి మంత్రి పరిటాల సునీతను ఆశ్రయించాడు. సమస్య పరిష్కరించండంటూ ధర్మవరపు మురళీ తదితరులను మంత్రి ఆదేశించారు. రంగంలోకి దిగిన మంత్రి సోదరుడు మురళి బుధవారం ఉదయం నరసింహారెడ్డిని, సర్పంచ్ కుమారుడు సాకే వెంకటేష్‌ను చర్చల పేరుతో పిలిపించుకుని, తమ పార్టీలో చేరాలని కోరినట్లు తెలిసింది.
ఆయన ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌ను రంగంలోకి దించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సీఐ తన సిబ్బందితో యర్రగుంటకు చేరుకుని చెరువులో సాగు చేసుకుంటున్న వైఎస్‌ఆర్ సీపీ మద్దతుదారులను మాత్రమే కలిసి వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆ సమయంలో ఇంటి వద్ద నరసింహారెడ్డి, పుల్లారెడ్డి, కేశవరెడ్డి, సాకే వెంకటేష్ లేకపోవడంతో వారిని సాయంత్రం ఐదు గంటలకు పోలీస్ స్టేషన్‌కు రప్పించుకున్నారు. చెరువు మట్టిని తరలించే సమయంలో అడ్డుకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై తహశీల్దార్ అందే హరికుమార్ మాట్లాడుతూ... వారం క్రితం గ్రామాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో చెరువు స్థలంలో గ్రామస్తులు సాగు చేసుకుంటున్న విషయం వెలుగు చూసిందన్నారు. ఆ స్థలాలను ఖాళీ చేయాలని వారికి నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకోనున్నట్లు చెప్పారు.