గన్మెన్లను వెనక్కి పంపిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, విజయవాడ(రామవరప్పాడు): కృష్ణా జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ శివారు రామవరప్పాడులో ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులు నిమిత్తం రైవస్ కాల్వకట్టపై ఇళ్లు తొలగించాలంటూ రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం స్థానికులకు నోటీసులు జారీ చేయడానికి వెళ్లారు. సమాచారం అందుకున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడికి చేరుకొన్నారు. అధికారులు, గ్రామ పెద్దలతో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా కొందరు స్థానికులు విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూలుస్తున్న ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ నినదించారు. ఎమ్మెల్యే వంశీ ఈ రాస్తారోకోలో పాల్గొనకుండా అధికారులతో చర్చలు కొనసాగించారు. ఆయన నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, ఎమ్మెల్యే వంశీపై పటమట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, ప్రజలను రెచ్చగొట్టారని, జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి వాహనదారులకు ఇబ్బంది కలిగించారనే అభియోగాలతో వివిధ సెక్షన్ల కింద ఎమ్మెల్యేతోపాటు 200 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసుల చర్యకు నిరసనగా ఎమ్మెల్యే వంశీ తనకు ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు గన్‌మెన్లను వెనక్కి పంపారు.