ఓరుగల్లు ప్రచార క్షేత్రంలోకి టీడీపీ!
♦ టీడీపీ - బీజేపీ ఉమ్మడి{పచార వ్యూహం ఖరారు
♦ ఎర్రబెల్లి నివాసంలో భేటీ అయిన ఇరు పార్టీల నేతలు
♦ నేటినుంచి ఉమ్మడి ప్రచారం!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలు, అధికారపార్టీపై ప్రజల్లో గూడుక ట్టుకున్న వ్యతిరేకతను వరంగల్ ఉప ఎన్నికల్లో తమ ఉమ్మడి అభ్యర్థి విజయానికి మెట్లుగా మలుచుకోవాలి..’ అని టీడీపీ-బీజేపీ నేతలు తీర్మానించుకున్నారు. ఈ మేరకు ఇరు పార్టీల నేతలు ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో రెండు పార్టీల నేతలు సమావేశమై వరంగల్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. సోమవారం నుంచి ఇరు పార్టీల నేతలు కలసి ప్రచారంలో పాల్గొననున్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ- టీడీపీల ఉమ్మడి అభ్యర్ధిగా డాక్టర్ దేవయ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాము టికెట్ ఆశించినా దక్కలేదనే అసంతృప్తితో టీడీపీ నేతలు పెద్దగా ప్రచారంలో పాల్గొనడం లేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒకదశలో తమకు టీడీపీ నేతలపై నమ్మకం లేదనే అభిప్రాయం కూడా బీజేపీ నుంచి వచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన తెలంగాణ టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో వరంగల్ ఉప ఎన్నికలపై అధినేత చంద్రబాబుతో సమీక్ష జరిగింది.
అదే సమయంలో తెలంగాణ బీజేపీ నేతలు కూడా చంద్రబాబును కలసి ప్రచారానికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆదివారం టీడీపీ, బీజేపీ నాయకులు ఎర్రబెల్లి నివాసంలో భేటీ అయ్యారని, వరంగల్ ఉప ఎన్నికల్లో ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రచారంపై వ్యూహాన్ని ఖరారు చే శారని తెలిసింది. వరంగల్ లోక్‌సభ పరిధిలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పరకాల, పాలకుర్తి సెగ్మెంట్లలో టీడీపీ విజయం సాధించింది. అయితే, పరకాల టీడీపీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి టీఆర్‌ఎస్ గూటికి చేరారు.
కాగా, ఉమ్మడి ప్రచారంలో భాగంగా ప్రతి పది పోలింగ్‌బూత్‌లకు ఒక సభ నిర్వహించనున్నారు. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి నేతలను క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి దింపాలని నిర్ణయానికి వచ్చారు. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలపైనే ప్రచారంలో దృష్టిపెట్టాలని తీర్మానించారు.