అమలాపురం ఎంపీ రవీంద్రబాబు
అమలాపురం టౌన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, లేకుంటే కేంద్రంతో తెగతెంపులకు కూడా సిద్ధమేనని అమలాపురం ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు అన్నారు. అమలాపురంలోని జెడ్పీ అతిథి గృహంలో బుధవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటులో జీఎస్‌టీ బిల్లు ఓటింగ్‌కు వచ్చినప్పుడు తాను మాట్లాడుతూ ఈ బిల్లుకు ఏపీ ఎంపీలమందరం మద్దతు ఇస్తాం... మీరు మాత్రం మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలోనూ ఇదే సహకారం అందించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కోరానని తెలిపారు. వచ్చే నెలలో కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా కోటిపల్లి–ముక్తేశ్వరం మధ్య గౌతమి నదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు తెరుస్తారని ఎంపీ చెప్పారు. అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణంపై కసరత్తులు జరుగుతున్నాయన్నారు. చమురు సంస్థలు మత్స్యకారులకు ఇవ్వాల్సిన పరిహార నిధులు దాదాపు రూ.100 కోట్లు విడుదలయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు ఎంపీ పేర్కొన్నారు. ఇటీవల దళితులపై దాడులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.