అక్రమ దందా... అడ్డుకునే దమ్ముందా? | TDP sand smuggling | Sakshi
Sakshi News home page

అక్రమ దందా... అడ్డుకునే దమ్ముందా?

Published Sun, Feb 19 2017 11:45 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

అక్రమ దందా... అడ్డుకునే దమ్ముందా? - Sakshi

అక్రమ దందా... అడ్డుకునే దమ్ముందా?

పెళ్లకూరు: స్వర్ణముఖినది నుంచి ఇసుక అక్రమంగా తరలిపోతోంది. రేయింబవళ్లు నిర్విరామంగా ట్రాక్టర్లతో కొందరు ఇసుకను తోడేస్తున్నారు. కొందరు అధికార పార్టీకి చెందిన వ్యాపారులు, నాయకులు.. ట్రాక్టర్‌ యజమానులు యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. అధికారులు వీరికి జతకలవడంతో అడ్డుకునేవారే కరువయ్యారు. ఇటీవల వైఎస్సార్‌ సీపీ నాయకులపై విద్యుత్‌ స్తంభాల పరిశ్రమల మేనేజర్‌ దాడి చేయడం వెనుక ప్రధాన కారణం కూడా ఇసుకదందాయేనని వెల్లడవుతోంది.

తాగు, సాగునీటికి ఆధారం
స్వర్ణముఖినది ఇరువైపులా పదివేల ఎకరా లకు పైగా వ్యవసాయ భూములకు సాగునీరు, 20గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఇక్కడి ప్రజలందరికి స్వర్ణముఖినది జీవనాధారం. నదికి ఇరువైపులా వ్యవసాయ విద్యుత్‌ మోటార్ల కింద 10వేల ఎకరాలకు పైగా వివిధ పంటలు సాగు చేస్తున్నారు. స్వర్ణముఖినది ఆధారంతో రెండు పంటలు పండించే అన్నదాతలకు ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగువచావలి, ఎగువచావలి, తాళ్వాయిపాడు, పెన్నేపల్లి, పుల్లూరు, చింతపూడి, ముమ్మారెడ్డిగుంట, కలవకూరు గ్రామాల నుంచి ట్రాక్టర్‌లతో రేయింబవళ్లు ఇసుక అక్రమంగా సెజ్‌లు, పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కానూరు, తాళ్వాయిపాడు, పెన్నేపల్లి, చావలి, ముమ్మారెడ్డిగుంట, కలవకూరు గ్రామాలకు చెందిన అధికార పార్టీ కార్యకర్తలు, ట్రాక్టర్‌ యజమానులు రేయింబవళ్లు తేడా లేకుండా ట్రాక్టర్లతో స్వర్ణముఖినదిలోని ఇసుకను అక్రమ రవాణా చేసి రూ.లక్షలు సంపాదిస్తున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం కావడంతో నిరంతరం సిరులు కురిపిస్తున్న అక్రమ ఇసుక రవాణాపై ఎక్కువ మంది అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్నేశారు.  

ఇటుకబట్టీల మాటున డంపింగ్‌
నాయుడుపేట–పూతలపట్టు జాతీయ రహదారి సమీపంలో పెన్నేపల్లి, తాళ్వాయిపాడు గ్రామాల వద్ద ఉన్న ఇటుకబట్టీల వద్ద ఇసుక డంపింగ్‌ చేసి ట్రాక్టర్లతో రాత్రి వేళ్లల్లో శ్రీసిటీ, తడ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్‌ ఇసుక రూ.3500 నుంచి రూ.4200 వరకు పలుకుతోంది. అదే విధంగా పుల్లూరు, ముమ్మారెడ్డిగుంట, చింతపూడి, కలవకూరు గ్రామాల నుంచి స్వర్ణముఖినదిలోని ఇసుకను ట్రాక్టర్లతో శ్రీకాళహస్తి, వెంకటగిరి పట్టణాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పాలచ్చూరుకు చెందిన పలువురు ట్రాక్టర్‌ యజమానులు స్వర్ణముఖినదిలోని ఇసుకను మేనకూరు సెజ్‌ పరిశ్రమలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.  

పట్టించుకోని అధికారులు
స్వర్ణముఖినది నుంచి ఇసుక అక్రమ రవాణాపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అక్రమార్కులకు అండగా ఓమాజీ ఎమ్మెల్యే నిలవడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా నోరు మెదపడం లేదు. వీరు కూడా తమకు తోచినంత దోచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. గట్టిగా ఎవరైనా అడిగితే ఇసుక అక్రమ రవాణాని అరికట్టాల్సింది రెవెన్యూ వారని పోలీసులు, పోలీసుల బాధ్యత అని రెవెన్యూ యంత్రాంగం ఒకరిపై మరొకరు సాకులు చెప్పుకుంటున్నారు. పెళ్లకూరు మండల కేంద్రానికి వెళ్లే వివిధ శాఖల అధికారులకు చావలి, తాళ్వాయిపాడు, పెన్నేపల్లి గ్రామాల వద్ద ఇసుక లోడుతో వెళుతున్న పలు ట్రాక్టర్లు ఎదురు పడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతుండటం గమనార్హం. ఎన్నో గ్రామాల తాగు, సాగునీటికి ఆధారమైన నదిని కాపాడాల్సినవారే మిన్నకుండటం విచారకరమని.. జిల్లా కలెక్టర్‌ స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఫలించని హైకోర్టు ఆదేశాలు
స్వర్ణముఖినది నుంచి ఇసుక రవాణాను నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అప్పటి జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌  స్వర్ణముఖినది నుంచి అక్రమ ఇసుక రవాణాని అరికట్టేందుకు నెలబల్లి క్రాస్‌రోడ్డు వద్ద ప్రత్యేక చెక్‌పోస్టును ఏర్పాటు చేసి పోలీసులచే నదీ తీర గ్రామాల్లో గస్తీ ఏర్పాటు చేశారు. దీంతో అక్రమ ఇసుక తరలింపుదారులకు చెక్‌ పడింది. అయితే ఆరు నెలల కిందట చెక్‌పోస్టును ఎత్తివేయడం వలన అక్రమ ఇసుక రవాణా ఊపందుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement