సంప్రదాయాలకు అనుగుణంగా బోధించాలి
Published Sun, Sep 25 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
– హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ శివశంకరరావు
నిడదవోలు : పూర్తిస్థాయిలో అక్షరాస్యత సాధించడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ బి.శివశంకరరావు అన్నారు. పట్టణంలో రోటరీ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం క్లబ్ అధ్యక్షుడు కేదారిశెట్టి రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన రోటరీక్లబ్ అక్షరాస్యత జిల్లా సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కతి సంప్రదాయాలను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అనాధిగా వస్తున్న సంప్రదాయాలకు అనుగుణంగా పిల్లలకు విద్యాభోదన చేయాలని సూచించారు. మంచి ఎరువులతో కూడిన విద్యను అందించడంతో పాటు ముందుగా ప్రాథమిక విద్యను అందించాలని కోరారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రాథమిక సౌకర్యాలు కల్పించడం కంప్యూటర్ ద్వారా విద్యాబోధన, వయోజన విద్య, వీధి బాలల గుర్తింపు ద్వారా అక్షరాస్యత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు జూనియర్ సివిల్ జడ్జి డి.సత్యవతి, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆర్.వెంకటేశ్వర శర్మ, సెమినార్ చైర్మన్ రోటేరియన్ నీలం నాగేంద్రప్రసాద్, జోనల్ కో–ఆర్డినేటర్ వడ్లమని జవహార్, ఎల్.సత్యనారాయణ, సరిత లునాని, జీకే శ్రీనివాస్, ఏవీ రంగారావు, భూపతి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement