
నడి సంద్రంలో నిలిచిన నౌక: ప్రయాణికుల ఆందోళన
విశాఖపట్నం: అండమాన్ వెళ్తున్న 'హర్షవర్దన్' నౌకలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో నడి సంద్రంలో నౌక నిలిచిపోయింది. దీంతో నౌక సిబ్బంది వెంటనే ఆ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో సాంకేతిక సిబ్బంది బృందాన్ని హర్షవర్దన్ నౌక వద్దకు పంపి లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు విశాఖ ఫోర్టు ట్రస్ట్ ఉన్నతాధికారి ఒకరు బుధవారం విశాఖలో వెల్లడించారు.
నౌకలో ఏర్పడిన సాంకేతిక లోపం నివారించేందుకు సిబ్బంది తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఈ నౌక దాదాపు 600 మంది ప్రయాణికులతో మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటలకు విశాఖపట్నం పోర్టు నుంచి అండమాన్ బయలుదేరింది. అయితే రాత్రి సమయంలో నౌకలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు సిబ్బంది గుర్తించారు.
నౌక నిలిచిపోవడంతో అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నౌకలో ప్రయాణిస్తున్న వారిలో అత్యధికులు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన వారని... వారంతా అండమాన్లో ఉపాధి చేసుకుంటున్న వారని సమాచారం. నౌక నడి సంద్రంలో చిక్కుకుందని తెలిసిన ప్రయాణికుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.