పది టీఎంసీలూ అనుమానమే
- తాగునీరు, చెరువులకే నీరు.. పంటల సాగుకు లేనట్లే
- ‘సాక్షి’తో హెచ్చెల్సీ ఎస్‌ఈ శేషగిరిరావు
అనంతపురం సెంట్రల్ : తుంగభధ్ర జలాశయం నుంచి ఈ ఏడాది 10 టీఎంసీలు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించలేదని హెచ్‌ఎల్‌సీ ఎస్‌ఈ శేషగిరిరావు పేర్కొన్నారు.
బుధవారం ఆయన తుంగభద్ర పరిస్థితిపై ‘సాక్షి’తో మాట్లాడారు. తొలుత ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి 151 టీఎంసీలు వస్తాయని అంచనా వేశారని, దామాషా ప్రకారం 22.066 టీఎంసీలు హె చ్‌ఎల్‌సీకి కేటాయింపులు చేశారని అన్నారు. అయితే ఊహించని విధంగా తుంగభద్రకు ఇన్‌ఫ్లో పడిపోయిందన్నారు. ప్రస్తుతం కేవలం 1900 క్యూసెక్కుల చొప్పున తుంగభద్రకు వస్తోందన్నారు. వారం రోజుల క్రితం వరకూ జలాశయంలోకి మొత్తం 70 టీఎంసీలు వస్తాయని ఆశించగా, ప్రస్తుతం అది కూడా 65 టీఎంసీలకు కుదించారన్నారు. ఈలెక్కన దామాషా ప్రకారం హె చ్‌ఎల్‌సీకి 9.4 టీఎంసీలు మాత్రమే వచ్చే అవకాశముందన్నారు.
గతేడాది అక్టోబర్‌లో జలాశయానికి 11 టీఎంసీలు వచ్చాయని, ఈ ఏడాది కూడా ఆ మేరకు ఇన్‌ఫ్లో ఉంటే మరో 1 టీఎంసీ మాత్రమే హె చ్‌ఎల్‌సీకి వస్తుందన్నారు. ఈ ఏడాదికి మొత్తం కలిపి 10 టీఎంసీలకు అటూ, ఇటూ మాత్రమే వస్తాయని వివరించారు. తాగునీటి అవసరాలకే 10 టీఎంసీలు కావాల్సి ఉంటుందన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా వచ్చే నీటిపై ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది హంద్రీనీవాకు మొత్తం 9 టీఎంసీలు కేటాయించారని చెప్పారు. ఇప్పటి వరకూ జీడిపల్లి జలాశయం నుంచి 0.78 టీఎంసీలు మాత్రమే పీఏబీఆర్‌లోకి వచ్చాయని తెలిపారు. హె చ్‌ఎల్‌సీ ఆయకట్టుకింద ఎక్కడా పంటల సాగు చేయొద్దని రైతులకు ఆయన తెలియజేశారు.