‘రియల్’ కోసం ఉద్యోగులు బలి! | Ten years not to stay in Hyderabad .. | Sakshi
Sakshi News home page

‘రియల్’ కోసం ఉద్యోగులు బలి!

Published Wed, Nov 4 2015 11:00 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

‘రియల్’ కోసం ఉద్యోగులు బలి! - Sakshi

‘రియల్’ కోసం ఉద్యోగులు బలి!

♦ పదేళ్లు హైదరాబాద్‌లో ఉండే అవకాశముండగా..
♦ హడావుడి తరలింపు ఎందుకు?
♦ రియల్‌ఎస్టేట్ బూమ్ సృష్టించడానికి మమ్మల్ని వాడుకుంటారా?
♦ {పభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్న ఉద్యోగులు

 
 సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి కాకముందే.. కొత్త రాజధానిలో రియల్‌ఎస్టేట్ ప్రయోజనాలకోసం ఉద్యోగుల్ని హడావుడిగా తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నించడం పట్ల వారిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్త రాజధానికి వెళ్లడానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వ పెద్దల్లో కొందరి స్వార్థ ప్రయోజనాలకోసం తమను వాడుకోవడమేంటని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఉండేందుకు అవకాశముండగా.. హడావుడి తరలింపు ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

కార్యాలయాలు, వసతి సదుపాయాల ఏర్పాటుకు కనీస చర్యలు చేపట్టకుండానే సిబ్బందిని తీసుకెళ్లడంవల్ల పాలనలో ఒనగూరే అదనపు ప్రయోజనం ఏమీలేకపోగా.. కొత్త ఇబ్బందులెదురవుతాయని వారు చెబుతున్నారు. విజయవాడ, దాని పరిసర ప్రాంతాల్లో కృత్రిమంగా రియల్‌ఎస్టేట్ బూమ్ సృష్టించడానికి, తద్వారా భారీగా సొమ్ము చేసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ఆపసోపాలు పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఆర్భాటంగా శంకుస్థాపన నిర్వహించినా.. ‘రియల్’ ప్రయోజనం కనిపించకపోవడంతో ఉద్యోగుల్ని తీసుకెళ్లి బూమ్ సృష్టించడానికి పాట్లు పడుతున్నారని మండిపడుతున్నారు.

 ఎలక్ట్రానిక్ పాలన ఉందిగా..
 ఏపీ ఉద్యోగులంతా హైదరాబాద్‌లోనే పనిచేయట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పెద్దసంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. సచి వాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రధాన కార్యాలయాల ఉద్యోగులే హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగుల సంఖ్య 25 వేలు ఉంటుందని ప్రభుత్వ అంచనా. కాగా ఎలక్ట్రానిక్ యుగంలో టెక్నాలజీని సమర్థంగా వాడుకుంటున్నామని, పాలనలో టెక్నాలజీ వాడకానికి పేటెంట్ రైట్ తానే అన్నట్టుగా చెప్పుకొంటున్న సీఎం చంద్రబాబు.. ఉద్యోగులు ఎక్కడ కూర్చుంటున్నారనే విషయంతో సంబంధం లేకుండా పాలన సాగించలేరా? ఈ-ఫైల్స్ వ్యవస్థలో ఫైళ్లను నడిపించలేరా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నా రు. ఫైలు ఏస్థాయిలో ఎవరివద్ద ఉంది? అనే విషయాన్ని ఒక్క క్షణంలో చెప్పే టెక్నాలజీ అందుబాటులో ఉందని, సచివాలయం హైదరాబాద్‌లో ఉన్నా ఈ విధానంలో సమర్థంగా ఫైళ్లను నడిపించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

 సీఎం కార్యాలయాలను ఖాళీచేస్తారా?
 విజయవాడకు తరలిపోయినట్లు సీఎం పదేపదే చెబుతున్నారని, మరి హైదరాబాద్‌లో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయాలను ఖాళీ చేస్తారా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉండాల్సిన అవసరం లేద ని భావించినప్పుడు.. కేవలం ఏడాదికోసం సచివాలయంలోని సీఎం కార్యాలయానికి, లేక్‌వ్యూ అతిథిగృహంలోని క్యాంపు కార్యాలయానికి రూ.కోట్లు ఎందుకు ఖర్చుపెట్టారో చెప్పాలని, ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చుపెట్టే అధికారం ఎవరిచ్చారో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సచివాలయ భవనాలకు వేసిన రంగులకు సంబంధించిన బిల్లులను ఇంకా చెల్లించనేలేదని గుర్తుచేస్తున్నారు. వెంటనే వెళ్లిపోవాలనుకుంటే భారీగా ఎందుకు ఖర్చుపెట్టారనే విషయంపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇబ్బందులుంటే.. సీఎం విజయవాడలోనే ఉండాలని, అంతేగానీ అక్కడ కార్యాలయాలు కూడా లేకుండా ఉద్యోగుల్ని తరలి రావాలనడంలో అర్థం లేదని వారంటున్నారు.

 నోటిఫై చేసి తరలింపు ఉత్తర్వులివ్వండి
 ప్రభుత్వానికి రియల్‌ఎస్టేట్ ప్రయోజనాలు కాకుండా ప్రజాప్రయోజనాలకోసమే ఉద్యోగుల్ని తరలించాలనే చిత్తశుద్ధి ఉంటే.. కొత్త రాజధానిని తక్షణం నోటిఫై చేసి, ఉద్యోగుల తరలింపుపై తగిన ఉత్తర్వులివ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లోని కార్యాలయాలనూ ఖాళీచేయాలని, బంధాన్ని పూర్తిగా తెంచుకుని కొత్త రాజధానికి తరలిపోవడానికి సిద్ధమేనని వారు చెబుతున్నారు. కర్నూలునుంచి హైదరాబాద్‌కు రాజధాని మారినప్పుడు ఇదేతరహా ఉత్తర్వులిచ్చారని, అప్పుడు కర్నూలులో పూర్తిగా ఖాళీ చేసి వచ్చిన విషయాన్ని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.
 
 రాజధాని ఎప్పుడు పూర్తవుతుందో చెప్పండి
 ‘రాజధానికి శంకుస్థాపన చేశారు. ఎప్పటిలోగా నిర్మాణం పూర్తిచేస్తారో చెప్పండి. పూర్తయిన మరుక్షణం రాజధానిని హైదరాబాద్ నుంచి తరలించండి. ఎవరికీ అభ్యంతరం లేదు. ఇప్పుడు విజయవాడ, గుంటూరు, మరోచోట.. తాత్కాలిక భవనాలు నిర్మించాల్సిన అవసరం ఏముంది? లేదంటే.. భారీగా అద్దెలు చెల్లించి తీసుకోవడం ఎందుకు? ఈ ఖర్చంతా ప్రజల మీద పడేదే కదా? రాజధాని శంకుస్థాపనకు ఉదారంగా ఖర్చు చేసినట్టుగా ప్రైవేటు వ్యక్తులు ఇస్తారా? యుద్ధప్రాతిపదికన ఏడాది కాలంలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తే.. ప్రజలమీద లేనిపోని భారం ఉండదు. అలా చేయకుండా, ప్రభుత్వ పెద్దల ప్రయోజనాలకోసం ఉద్యోగుల తరలింపు పేరిట అంతులేని వ్యయానికి తెరతీస్తున్నారు’ అని సచివాలయ ఉద్యోగులు విమర్శిస్తున్నారు.
 
 ఉమ్మడి రాజధాని..సెక్షన్-8 ఏమయ్యాయి?
 ఉమ్మడి రాజధానిలో ఏపీకి సర్వ హక్కులున్నాయని, పదేళ్లపాటు పాలన సాగిస్తామని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన ప్రారంభరోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన మాటలను ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ‘ఓటుకు కోట్లు ’ కేసు హాట్‌గా ఉన్నప్పుడు సెక్షన్-8 గురించి ఊదరగొట్టిన సీఎం.. ఇప్పుడు హఠాత్తుగా రూటు మార్చడం వెనక ఉన్న ప్రయోజనాలేమిటో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement