- రూ.4.26 కోట్ల పనుల్లో కాంట్రాక్టర్ల ప్రయత్నం
అభివృద్ధి పనుల టెండర్లలో రింగ్?
Published Tue, Sep 6 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM
కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థలో ఇటీవల పిలిచిన రూ.4.26 కోట్ల అభివృద్ధి పనుల టెండర్లు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు రింగ్‌కు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 13వ, 14వ ఆర్థిక సంఘం నిధులతోపాటు ఎస్సీ, జనరల్ ఫండ్ నిధులు రూ.4.26 కోట్లతో 52 అభివృద్ధి పనుల కోసం ఆన్‌లైన్‌లో ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు పిలిచారు. ఈనెల 2న టెండర్లకు షెడ్యూల్ దాఖలు చేయడానికి చివరి గడువు విధించగా, ఆ రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో కాంట్రాక్టర్లు వాయిదా వేయాలంటూ వినతిపత్రం సమర్పించారు. దీంతో అధికారులు బుధవారానికి వాయిదా వేశారు. సమయం పొడిగించడంతో కాంట్రాక్టర్ల మధ్య రాజీయత్నాలు జరుపుకోవడానికి మార్గం సులువైంది. మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్లు మార్కండేయకాలనీలోని ఓ రహస్య ప్రాంతంలో మంతనాలు జరిపారని తెలిసింది. కాంట్రాక్టర్లు అందరూ సయోధ్యతతో ఉంటేనే అనుకున్న వారికి పనులు వస్తాయని వారు చర్చించుకున్నట్లు సమాచారం. కాంట్రాక్టర్లు ఏ రేట్లకు షెడ్యూల్ దాఖలు చేశారన్న విషయం బుధవారం సాయంత్రం తెలియనుంది.
Advertisement