గచ్చిబౌలి: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ విద్యార్థి సంఘం షాపింగ్ కాప్లెక్స్ వద్ద సమావేశమైంది. ప్రతిగా మరో విద్యార్థి సంఘం సౌత్ క్యాంపస్ నుంచి ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో ఎన్‌హెచ్ హాస్టల్ వద్ద రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో రెండు సంఘాలకు చెందిన ఇద్దరు విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ఇటీవల షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహం మాయం కావడంతో మరో విగ్రహాన్ని తీసుకొచ్చేందుకు ఆదివారం తెల్లవారుజామున ఏఎస్‌ఏ ప్రయత్నించింది. సెక్యూరిటీ సిబ్బంది విగ్రహాన్ని లోపలికి తీసుకురావద్దని అడ్డుకోవడంతో వెనుదిరిగారు. మళ్లీ ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో క్యాంపస్‌లో పోలీసులు భారీగా మోహరించారు.
పోలీసులకు ఫిర్యాదు
హెచ్‌సీయూలో జరిగిన ఘర్షణలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మియాపూర్ ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన మేరకు.. హెచ్‌సీయూలో జరిగిన ఘర్షణలో కైలాసం అనే విద్యార్థికి గాయాలయ్యాయి. అతన్ని మియాపూర్‌లోని ఓ ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకువచ్చారు. ఆ తర్వాత మరోవిద్యార్థి అన్‌మోల్‌సింగ్‌ను సైతం అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. ఆ సమయంలో ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ ఆస్పత్రి వద్ద ఉన్నాడు. అన్‌మోల్‌సింగ్‌ను చూపిస్తూ తనపై ఇతనే దాడి చేశాడని కైలాసం..సుశీల్‌కు చెప్పాడు. దీంతో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ మేరకు సుశీల్‌కుమార్ మియాపూర్ పోలీసులకు ఫిర్యాదుచేయగా...అన్‌మోల్‌సింగ్‌పై ఆదివారం కేసు నమోదు చేశారు. కాగా ఈ అంశంపై హెచ్‌సీయూ జేఏసీ నాయకుడు ప్రశాంత్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తమ విద్యార్థిపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపించారు. అన్‌మోల్‌సింగ్ కూడా తనపై దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు.
కొవ్వొత్తుల ప్రదర్శన..
పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ బలవన్మరణానికి పాల్పడి ఆరునెలలు పూర్తికావడంతోపాటు, కారంచేడు ఘటన జరిగి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వర్సిటీ విద్యార్థులు ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రోహిత్ చట్టం తీసుకురావాలని నినాదాలుచేశారు.