- కొడంగల్ ఎత్తిపోతల సాధన యాత్రను
అడ్డుకున్న టీఆర్‌ఎస్ నాయకులు
- పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
కోయిల్‌కొండ(మహబూబ్‌నగర్ జిల్లా)
నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా కోయిల్‌కొండ మండలానికి ప్రయోజనమేమీ లేదని, ఈ ప్రాంత ప్రజలను ఎందుకు రెచ్చ గొడుతున్నారని అఖిలపక్షం చేపట్టిన పాదయాత్రను ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌కొండ మండలంలోని శేరివెంకటాపూర్ గ్రామంలో టీఆర్‌ఎస్ నాయకులు, రైతులు అడ్డుకుని నిలదీశారు. జలసాధనకమిటీ జిల్లా అధ్యక్షుడు అనంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోథకం సాధన కోసం పదిరోజులుగా పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ, టీడీపీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రెడ్డిగారి రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర శేరివెంకటాపూర్ గ్రామానికి చేరుకుంది. గ్రామంలో ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తుండగా స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు, రైతులు అడ్డుకున్నారు. గతంలో జూరాల ద్వారా 38గ్రామాలను ముంచడానికి ప్రభుత్వం కోయిల్‌కొండ రిజర్వాయర్ అనుమతి చెప్పడం ద్వారా ఈప్రాంత మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి కృషితో ప్రాజెక్టు నిలిచిందని, మునిగే 38గ్రామాలకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోథల పథకం ద్వారా కర్వెన నుంచి సాగునీరు అందించేందుకు కషిచేస్తున్నారని అన్నారు.
దీంతో కొద్దిసేపు ఉద్రిక్తవాతావరణం నెలకొంది. టీఆర్‌ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఈ ప్రాంతమంతా గందరగోళంగా మారింది. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలకు శాంతింపజేశారు. ఈ ఘటనను నిరసిస్తూ నారాయణపేట నియోజకవర్గ వ్యాప్తంగా అఖిలపక్ష కార్యకర్తలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం, నాయకుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకోవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.