అమ్మ లేదు.. నాన్న ఉన్నా లేనట్టే
* పదో తరగతి విద్యార్థిని దుస్థితి
* అనారోగ్యంతో అవస్థ
పాలకొల్లు అర్బన్ : ఈమె పేరు చిట్టాల స్రవంతి. యలమంచిలి మండలం ఇలపకుర్రు గ్రామానికి చెందిన స్రవంతి దొడ్డిపట్ల జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. ఆమె చిన్నతనంలోనే తండ్రి రాంబాబు ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. తల్లి పద్మ అనారోగ్యంతో 10 నెలల క్రితం మరణించింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ బాలిక రోగ పీడితురాలైంది. వృద్ధాప్యానికి చేరిన తాతయ్య సుబ్బారావు, నాయనమ్మ అనంతలక్ష్మి చెంతకు చేరిన ఆ బాలిక చదువు కొనసాగించలేక.. ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ఆర్థిక స్థోమత లేక అవస్థలు పడుతోంది. దయార్ధ్ర హృదయులు స్పందించి ఆర్థిక సహాయం అందించాలని కోరుతోంది.
ఆపరేషన్ చేయాలంటున్నారు
స్రవంతి తాతయ్య సుబ్బారావు, నాయనమ్మ అనంతలక్ష్మి మాట్లాడుతూ.. ‘పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనే ఆశతో ఎన్నో పూజలు చేసి.. ఎందరో దేవుళ్లకు మొక్కితే మాకు అబ్బాయి పుట్టాడు. రాంబాబు అని పేరు పెట్టుకున్నాం. వాడికి పెళ్లి చేశాం. కూతురు పుట్టిన కొన్నిరోజులకు ఇల్లు విడిచిపోయాడు. ఎప్పటికైనా తిరిగొస్తాడని చూస్తుండగా.. ఈ మధ్యనే మా కోడలు కాలం చేసింది. ఆ దుఃఖం నుంచి తేరుకోకముందే గోరుచుట్టుపై రోకటి పోటులా మా మనుమరాలు స్రవంతి అనారోగ్యం పాలైంది. ఆమె మెడపై కణుతులు వచ్చాయి.
పెద్దాసుపత్రులకు తీసుకువెళ్లడానికి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. అయినా ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడి వైద్యుల సూచన మేరకు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చూపించాం. మెడ వాపులు తగ్గితే ఆపరేషన్ చేయవచ్చంటున్నారు. మేం బతకడమే కష్టంగా ఉంది. మా మనుమరాలు స్రవంతికి ఎలా వైద్యం చేయించాలో అర్థం కావడం లేదు. బిడ్డ కోలుకుంటే చదువుకునే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. దయార్ధ్ర హృదయులు స్పందించి ఆర్థిక సహాయం అందిస్తే పాపకు వైద్యం చేయిస్తాం. సాయం చేయదలచిన వారు 78425 62505 సంప్రదించాలి’ అని విజ్ఞప్తి చేస్తున్నారు.