తేమ శాతం పన్నెండు వరకే...
♦ పత్తి కొనుగోళ్లపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష
♦ దళారీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం
♦ ఆన్‌లైన్ విధానంలోనే రైతులకు చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: తేమ శాతం 12 లేదా అంతకంటే తక్కువ ఉంటేనే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తుందని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లపై మంత్రి సోమవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్ డైరక్టర్ డాక్టర్ శరత్, అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి సమీక్షలో పాల్గొన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు పత్తిని సంచుల్లో కాకుండా విడిగా తీసుకురావాలని... ఈ మేరకు కరపత్రాలు, పోస్టర్ల ద్వారా మార్కెటింగ్, రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ప్రచారం కల్పించాలని హరీశ్ సూచించారు.
పత్తి కొనుగోలులో దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు రైతులకు యుద్ధ ప్రాతిపదికన గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. నిర్దేశించిన తేదీల్లో సీసీఐ 84 పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు, సిబ్బంది డ్రెస్‌కో డ్‌ను పాటించడంతో పాటు, గుర్తింపుకార్డులు ధరించాలని అన్నారు. అవసరమైన చోట పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడంతో పాటు, జేసీలు, కలెక్టర్లు తరచూ తనిఖీలు చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. సీసీఐ సిబ్బందితో సమన్వయం కోసం జిల్లా స్థాయిలో ఇప్పటికే మార్కెటింగ్ శాఖ నోడల్ అధికారులను నియమించిందని, రెవెన్యూ విభాగమూ తక్షణమే నోడల్ అధికారులను నియమించాలన్నారు.
మౌలిక సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ
పత్తి కొనుగోలు లావాదేవీలకు సంబంధించిన తక్‌పట్టీని ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారానే రైతులకు జారీ చేయాలని మంత్రి హరీశ్ సూచించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలకు సమీపంలో ఉన్న వే బ్రిడ్జీల్ని గుర్తించి, వాటిలోనే తూకం వేయిం చాలన్నారు. అగ్నిమాపక యంత్రాలు, కవర్ షెడ్లు విధిగా సమకూర్చుకోవడంతో పాటు తేమ శాతాన్ని కొలిచే పరికరాలను గ్రామస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రవాణా, గోదాములు, హమాలీలు, మిల్లులతో ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నారు. రైతులు అమ్మిన పత్తికి సంబంధించిన చెల్లింపులు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మొక్కజొన్న ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపైనా మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు.