
ఆగిన వివాహం...వరుడు, వధువు మాయం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మల్యాల గ్రామంలో పోలీసులు, రెవెన్యూ అధికారుల చొరవతో శుక్రవారం ఓ బాల్య వివాహం ఆగిపోయింది. కానీ, మండపం నుంచి వధువు, వరుడు అదృశ్యమవడం సంచలనం సృష్టించింది.
గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికకు లకా్ష్మజీపల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడితో శుక్రవారం ఉదయం 11.45 నిమిషాలకు మల్యాల గ్రామంలో పెళ్లి జరగాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు 11 గంటలకు పెళ్లి మండపానికి చేరుకున్నారు.
అదే సమయంలో మండపం నుంచి వధువు, వరుడు కనిపించకుండా పోయారు. దీనితో వధూవరులకోసం చూసిన పోలీసులు ఇరు కుటుంబాలకు చెందిన వారిని పిలిచి 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయరాదని కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈసందర్బంగా చైల్డ్ ప్రొటక్షన్ అధికారి కైలాస్ మాట్లాడుతూ బాల్య వివాహం చట్టరిత్యా నేరమన్నారు.