తెలంగాణపై కేంద్రంలో బీజేపీ వివక్ష
♦ బీజేపీ నేతలపై ధ్వజమెత్తిన ఎంపీ కవిత
♦ విభజన చట్టం హామీలను అమలు చేయని కేంద్రం
♦ హైదరాబాద్‌పై ఒక ప్రేమ... అమరావతిపై మరో ప్రేమ
♦ సీఎం కేసీఆర్ ప్రతిపాదనలను బేఖాతరు చేస్తున్న ప్రధాని
♦ పనిచేయని ప్రభుత్వమంటూ బదనాం చేస్తారా
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని ఎన్‌డీయే సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని నిజామాబాద్ ఎంపీ కె.కవిత మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో ఇస్తున్న ప్రాధాన్యం ఇతర రాష్ట్రాలకు ఇవ్వడం లేదని, పొరుగున ఉన్న ఏపీపై ప్రధాని మోదీ ఎనలేని ప్రేమ కనబరుస్తున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఆమె ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలను ఏమాత్రం పట్టించుకోవడం లేద న్నారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం తీరును నిలదీ స్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పనిచేయని ప్రభుత్వంగా బదనాం చేసేలా రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ గత ఏడాది జూన్‌లోనే రాష్ట్రానికి సంబంధించిన 14 అంశాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకువెళ్లారని, కానీ కేంద్రం ఆ అంశాలను బేఖాతరు చేసిందన్నారు.
హైకోర్టు విభజనను పట్టించుకోలేదు
ఉమ్మడి హైకోర్టును విభజించాలని ఎప్పటి నుంచో కోరుతున్నా అసలు పట్టించుకోవడం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు మాత్రం కేంద్ర మంత్రి సదానందగౌడ దీనిపై హామీ ఇచ్చి, ఎన్నికల తర్వాత అటకెక్కించారని కవిత అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకుడు జైపాల్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందు కు ప్రకటించడం లేదన్నారు. ఎన్టీపీసీకి కోల్ లింకేజి ఇవ్వడానికి కేంద్రానికి ఏడాది కాలం పట్టిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరినా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్య నాయుడు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఏపీ రాజధాని అమరావతికి మాత్రం రూ.2 వేల కోట్లు ఇస్తామని ప్రకటించారని, ఇది ఆంధ్రా అమాత్యుల పక్షపాతం కాదా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు నిధులు అడిగితే పైసా ఇవ్వలేదన్నారు. ఏపీకి ఐఐఎం, ఎయిమ్స్ వంటి విద్యా సంస్థలను ఇచ్చారన్నారు.
మోదీని నిలదీసే దమ్ము దత్తాత్రేయకుందా?
ప్రధాని మోదీని నిలదీసి రాష్ట్రానికి ఎయిమ్స్ కావాలని అడిగే దమ్ము కేంద్ర మంత్రి దత్తాత్రేయకు ఉందా అని కవిత అడిగారు. తెలంగాణలో 6 వేల కిలోమీటర్ల రోడ్డు అడిగితే 12 వందల కి.మీ. మాత్రమే ఇచ్చారన్నారు. బయ్యారం స్టీల్‌పాంట్ ఊసే లేదని, వరంగల్‌కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే తిరస్కరించిన కేంద్రం ఏపీకి కేటాయించిందన్నారు. 16నెలల కాలంలో సీఎం కేసీఆర్ ఐదు సందర్భాల్లో ప్రధానిని, కేంద్ర మంత్రులను కలసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారని, వివిధ ప్రతిపాదలను ఇచ్చారని గుర్తు చేశారు.