ఓర్వలేకనే ప్రభుత్వంపై ఆరోపణలు
- దిగ్విజయ్‌సింగ్‌పై ఎంపీ కవిత మండిపాటు
- ముందు కాంగ్రెస్‌ను చక్కదిద్దుకోవాలని హితవు
సాక్షి, హైదరాబాద్: ‘‘ముందు మీ పార్టీని చక్కదిద్దుకోండి. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మా ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేకనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. మా నిజాయితీ రాష్ట్ర ప్రజలకు తెలుసు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌పై నిజామాబాద్ ఎంపీ కవిత మండిపడ్డారు. దిగ్విజయ్ ఏపీకి అమ్ముడుపోయిన వ్యక్తి అని దుయ్యబట్టారు. శుక్రవారం మీడియా పాయింట్ వద్ద కవిత విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై దిగ్విజయ్ ఆరోపణలను ఖండించారు. సీఎం కేసీఆర్ విజన్ చూశాకే సీనియర్ నే తలు డీఎస్, ఎంపీ గుత్తా తమ పార్టీలో చేరారన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా ఉందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో దొంగచాటు రాజకీయాలు ఉండవని, ఎప్పుడైనా, ఎవరు వచ్చినా తమ పార్టీ కండువా కప్పుతామన్నారు. కమీషన్లకు కక్కుర్తిపడే నాయకులు ఎవరూ టీఆర్‌ఎస్‌లో లే రన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ నేతలు అది ఏమైందో చెప్పాలన్నారు.
అమిత్ షావి తప్పుడు లెక్కలు...
తెలంగాణకు కేంద్ర సాయంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తప్పుడు లెక్కలు చెప్పారని కవిత మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయంపై చర్చకు సిద్ధమా అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు చాలా తక్కువన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వడం లేదని కవిత ఆరోపించారు. కేంద్ర మంత్రి గడ్కరీ ఇచ్చిన నిధులు ఏపాటో లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన ప్రతీ పైసాకు తాము లెక్క చెబుతామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రెండేళ్లలో కేవలం రూ. 1,500 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. ఐటీ రంగంలో కేంద్రం ఇప్పటివరకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఐటీఐఆర్ గురించి బీజేపీ నేతలకు ఏమీ తెలియదని, దీనిపై సీఎం కేసీఆర్ ఇప్పటికే డీపీఆర్ ఇచ్చారని గుర్తుచేశారు. హైకోర్టు విభజన కోసం లాయర్లు చేస్తున్న ఆందోళనను బీజేపీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.