ముగిసిన గడువు
► వీవీ పోస్టులకు వెయ్యికి పైగా దరఖాస్తులు
► జిల్లాలో 236 పోస్టులు
► నేడు, రేపు సర్టిఫికెట్ల పరిశీలన
► 8న మెరిట్ జాబితా ∙10న తుది దశ ఎంపిక
► 12న పాఠశాలల్లో చేరిక
సాక్షి, నిర్మల్: విద్యావాలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు సోమవారంతో ముగిసింది. ప్రభుత్వ వెబ్‌సైట్లో ఆన్‌లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో పూర్తిస్థాయిలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారన్న వివరాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఇంకా అందలేదు. అయితే ఒక్క నిర్మల్ మండలం పరిధిలోనే చివరి రోజు 300లకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా వెయ్యి మందికిపైగా దరఖాస్తు చేసుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
జూన్ 12న పాఠశాలల్లో చేరేలా...
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,011 ఉండగా సుమారు 1.15 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జిల్లాలో 236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 162 ఎస్జీటీ, 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అందులో ఉన్నాయి. విద్యావాలంటీర్ల ద్వారా ఆ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఈ నెల మొదట్లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 2 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించారు. సోమవారంతో గడువు ముగిసింది.
వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవడంతో సంఖ్య పరంగా విద్యాశాఖకు ఇంకా వివరాలు అందలేదు. కాగా మంగళ, బుధవారాల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. ఈ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 3 పాస్‌పోర్టు సైజ్‌ఫొటోలతో సంబంధిత ఎంఈవో కార్యాలయాల్లో సంప్రదించాలని విద్యాశాఖ అధికారులు తెలుపుతున్నారు. జూన్ 8న తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. 9న ఆ జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. జూన్ 10న తుది సెలక్షన్ జాబితాను విడుదల చేస్తారు. 12న పాఠశాలల పునఃప్రారంభం రోజు వీవీలు విధుల్లో చేరాల్సి ఉంటుంది.
గతంలో ఆలస్యం
ప్రభుత్వం ప్రతీ విద్యాసంవత్సరం ఆలస్యంగా విద్యావాలంటీర్ల నియామకాలు చేపట్టేది. దీంతో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నచోట విద్యార్థులకు సరైన బోధన జరగక నష్టపోయే పరిస్థితులు ఉండేవి. ప్రతీ ఏడాది జూలై, ఆగస్టు నెలల వరకు నియామక ప్రక్రియ జరగకపోవడంతో మూడు నెలల పాటు విద్యార్థుల చదువుకు ఆటంకం ఏర్పడేది. ఈ ఏడాది జూన్ మాసం వరకు డీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించనప్పటికీ ఇంకా దానికి సంబంధించిన నోటిఫికేషనే విడుదల చేయలేదు.
మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగకుండా జూన్‌లోనే వీవీ నియామకాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో తాత్కాలిక పద్ధతిన పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఉపాధ్యాయుల కొరత సమస్యకు తాత్కాలికంగా ఉపశమనం కలగనుంది. విద్యావాలంటీర్లకు గతేడాది రూ.8వేల చొప్పున చెల్లించగా, ఈ విద్యాసంవత్సరం నెలకు రూ.12 వేలు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పలువురు టీటీసీ, బీఈడీ పట్టాఉన్న నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
జిల్లా యూనిట్‌గా రోస్టర్ పాయింట్
జిల్లా యూనిట్‌గా మండలం వారీగా రోస్టర్ పాయింట్‌ను సిద్ధం చేశాం. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మంగళ, బుధవారాల్లో సంబంధిత ఎంఈవోల వద్ద సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలి. జూన్ 12వ తేదీలోగా వీవీ పోస్టులను భర్తీ చేస్తాం.
– ప్రణీత, డీఈవో