
మరణంలోనూ వీడని స్నేహం
కాలువలోకి దూసుకెళ్లిన బైక్
ఇద్దరు యువకుల దుర్మరణం
రెండు కుటుంబాల్లో విషాదం
బసంత్‌నగర్ : రామగుండం మండలం బసంత్‌నగర్ విమానశ్రయం సమీపంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణస్నేహితులు దుర్మరణం చెందారు. గంగిరెద్దులకాలనీ వద్ద బైక్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మిట్ట రాజ్‌కుమార్(23), పల్లికొండ మల్లేశ్(23) మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్టీపీసీలోని సుభాష్‌నగర్‌కు చెందిన మిట్టపల్లి రాజమౌళి- శారద కుమారుడు రాజ్‌కుమార్, అన్నపూర్ణ కాలనీకి పల్లికొండ పోచం- ముత్తమ్మ కుమారుడు మల్లేశ్ స్నేహితులు. ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై ఎన్టీపీసీ నుం చి పుట్నూర్‌లో ఉంటున్న రాజ్‌కుమార్ అత్తమ్మ కొడిపెల్లి రాజేశ్వరి వద్దకు వచ్చారు. అయితే రాజేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి అప్పటికే సమీపంలోని ఈసాలతక్కళ్లపల్లి జాతరకు వెళ్లడంతో వారిని కలిసిన రాజ్‌కుమార్, మల్లేశ్ అక్కడే భోజనాలు చేశారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్టీపీసీకి బయల్దేరారు. మార్గమధ్యంలో విమానాశ్రయం వద్ద మూలమలుపును గమనించక నేరుగా దూసుకెళ్లడంతో సమీపంలోని ఎస్సారె స్పీ కెనాల్‌లో బైక్‌తో సహా పడ్డారు. తీవ్రంగా గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గురువారం వేకువజామున ఓదెల మండలం కొలనూర్‌లో జరిగే జాతరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న రాజ్‌కుమార్ కుటుంబసభ్యులు అతడి మొబైల్‌కు ఫోన్ చేయ గా స్పందించలేదు. ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతదేహాలను గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారు వచ్చి స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న బసంత్‌నగర్ ఎస్సై విజయేందర్ మృతుల సెల్‌ఫోన్ ద్వారా వారి కుటుం బసభ్యులకు సమాచారం తెలియజేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజ్‌కుమార్ తండ్రి రాజమౌళి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇద్దరూ ప్రాణస్నేహితులు..
నిరుపేద కుటుంబాలకు చెందిన రాజ్‌కుమార్, మల్లేశ్ ప్రాణస్నేహితులు. రాజ్‌కుమార్ హైదరాబాద్‌లోని విమానశ్రయంలో ఆరు నెలలుగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మల్లేశ్ గతంలో సెల్‌ఫోన్ షాపులో పని చేసి ఇటీవలే స్థానికంగా క్యాజ్‌వల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రామగుండంలో జరిగే వారి మిత్రుడి వివాహంతోపాటు సమ్మక్క- సారలమ్మ జాతర కోసం రాజ్‌కుమార్ రెండు రోజుల క్రితమే ఎన్టీపీసీకి వచ్చాడు. ఎప్పుడూ కలిసి తిరిగే వీరిద్దరు స్థానికంగా అందరితో కలివిడిగా ఉందేవారు. మరణంలో వీరి స్నేహబంధం వీడకపోవడంతో అందరినీ కలిచివేసింది.
ఎన్టీపీసీలో విషాదం
రాజ్‌కుమార్, మల్లేశ్ మరణంతో ఎన్టీపీసీ ప్రాంతంలో విషాదం అలుముకుంది. రాజ్‌కుమార్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. చేతికందివచ్చిన కుమారుడు అకాల మరణంతో చెంద డంతో అతని తల్లిదండ్రులతోపాటు తోడుగా ఉంటాడనుకున్న చెల్లి స్వర్ణ కన్నీరుమున్నీరవుతున్నారు. మల్లేశ్ అన్న ఇటీవల ఓ కేసు విషయంలో జైల్లో ఉన్నాడు. ఆసరాగా ఉండే మల్లేశ్ మృతి ఆ కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.