ఎమ్మెల్యే vs మున్సిపల్ చైర్పర్సన్
►కురుగొండ్లపై పోరుకు సిద్ధమైన మున్సిపల్‌చైర్ పర్సన్
► ప్రతి విషయంలో చేయి పెడితే తానెందుకుంటూ అసంతృప్తి
► ఎమ్మెల్యే రబ్బరు స్టాంపు కాదని ఎదురు దాడి
► రామకృష్ణపై సీఎంకు ఫిర్యాదుచేయాలని నిర్ణయం
► నారాయణకు మరో తలనొప్పిగా వెంకటగిరి వ్యవహారం
నెల్లూరు: నెల్లూరు కార్పొరేషన్‌లో ఏసీబీ దాడుల అనంతర పరిణామాలతో తలబొప్పి కట్టిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఇది మరో తలనొప్పిగా మారనుంది. 2014లో వెంకటగిరి మున్సిపల్ ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్లకు ప్రతిష్టాత్మకమై కూర్చుంది. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతోందనే అభిప్రాయం ప్రజలకు కలిగితే తన ఓటమి తప్పదని ఆందోళన చెందారు. చైర్‌పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఎమ్మెల్యే మరింత కంగారు పడ్డారు. కౌన్సిలర్లు, ఇతర ఖర్చులు భరించి చైర్‌పర్సన్ పదవి కోసం ముందుకొచ్చే వారి కోసం భూతద్దం వేసి వెదికారు. అప్పటి వరకు రాజకీయాలతో సంబంధం లేని దొంతు బాలకృష్ణ కుటుంబానికి ఎర వేశారు. స్థితిమంతుడు కావడంతో పాటు ఆయన సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉండటంతో ఎమ్మెల్యే ఆ కుటుంబాన్ని ముగ్గులోకి దించారు. మెజారిటీ కౌన్సిలర్లు గెలిస్తే బాలకృష్ణ సతీమణి దొంతు శారదను చైర్‌పర్సన్‌ను చేసే ఒప్పందంతో వారిని రంగప్రవేశం చేయించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ కౌన్సిల్ స్థానాలు గెలవడంతో మాట ప్రకారం శారదను చైర్‌పర్సన్‌గా చేశారు. మరో సామాజిక వర్గానికి చెందిన బీరం రాజేశ్వరరావును వైస్ చైర్మన్‌ను చేశారు.
పట్టు పోతుందని భయం
చైర్‌పర్సన్ శారద విద్యావంతురాలు కావడంతో మున్సిపాలిటీ పాలనపై మెల్లగా పట్టు పెంచుకుంటూ వచ్చారు. అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకున్నారు. పట్టణం మీద ఈ కుటుంబం పట్టు పెరిగితే తన పలుకుబడి తగ్గిపోతుందనే భయంతో ఎమ్మెల్యే రామకృష్ణ చైర్‌పర్సన్ ఎన్నిక జరిగిన మూడు నెలల నుంచే తన మార్కు రాజకీయం చేయడం ప్రారంభించారు. తనకు అనుకూలంగా ఉండే వ్యక్తిని మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేయించుకున్నారు. తనకు తెలియకుండా మున్సిపాలిటీలో ఏ చిన్న పని కూడా జరగరాదని కమిషనర్‌కు హుకుం జారీ చేశారు. దీంతో మున్సిపాలిటీలో పావలా పని జరగాలన్నా ఎమ్మెల్యే అనుమతి కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అధికారులెవరూ చైర్‌పర్సన్ మాట లెక్క చేయని స్థితి ఏర్పడింది.
ఇదే సందర్భంలో ఎమ్మెల్యే వైస్ చైర్మన్‌ను ప్రోత్సహిస్తూ చైర్‌పర్సన్‌కు విలువ లేకుండా చేసే విధంగా పావులు కదుపుతూ వచ్చారు. మున్సిపాలిటీలో ప్రతి చిన్న విషయంలో ఎమ్మెల్యే చేయి పెడుతుంటే ఇక తాను చైర్‌పర్సన్‌గా ఉండటం ఎందుకని శారద బహిరంగంగా మాట్లాడటం ప్రారంభించారు. రామకృష్ణ తనను కేవలం ఉత్సవ విగ్రహంలా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు, తనకు కల్పిస్తున్న ఇబ్బందులను శారద గతంలో మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను కట్టడి చేయకపోతే తాను పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని గట్టిగానే వివరించారు. మంత్రి ఆదేశం మేరకు కొంత కాలం పాటు ఎమ్మెల్యే మున్సిపాలిటీ వ్యవహారాల్లో నేరుగా తల దూర్చకుండా వైస్ చైర్మన్ ద్వారా రాజకీయం నడుపుతూ వచ్చారు.
కథ మళ్లీ మొదటికొచ్చింది
ఆరు నెలల నుంచి ఎమ్మెల్యే రామకృష్ణ మళ్లీ పాత పద్ధతికి వచ్చారు. తనకు తెలియకుండా ఏ పనీ చేయరాదని కమిషనర్‌తో పాటు కింది స్థాయి సిబ్బందిని సైతం ఆదేశించారు. ఉద్యోగులకు సంబంధించిన పరిపాలనా వ్యవహారాలు, అభివృద్ధి పనుల్లో ఆయన చెప్పందే ఎవరూ అడుగు కూడా ముందుకు వేయని పరిస్థితి ఏర్పడింది. తమను పట్టుబట్టి రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు అవమాన పరుస్తున్నారని చైర్‌పర్సన్ తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. బాగా చదువుకున్న తనకు మున్సిపాలిటీ వ్యవహరాలను చూసుకోగలనని, ఎమ్మెల్యేను గౌరవించి ఆయన చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుంటాను గానీ ఆయన చేతిలో రబ్బరు స్టాంప్‌గా మారలేనని ఆమె పార్టీ ముఖ్య నాయకులతో అసంతృప్తి వెళ్లగక్కారని సమాచారం.
మంత్రి నారాయణకు చెప్పినా ఎమ్మెల్యే మారలేదని, అలాంటప్పుడు తాము పార్టీలో, పదవిలో ఎందుకు ఉండాలని వారు యోచిస్తున్నారు. సమస్యను నేరుగా సీఎం చంద్రబాబుకు వివరించి అప్పటికీ ప్రయోజనం లేకపోతే తమ దారి తాము చూసుకోవాలని చైర్‌పర్సన్ భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌లో ఏసీబీ దాడుల అనంతరం టీడీపీలో ఏర్పడిన పరిణామాలు మంత్రి నారాయణకు తలబొప్పి కట్టించాయి. ఈ పరిస్థితిలో మరో మున్సిపాలిటీలో పార్టీ నేతల మధ్య గొడవలు రేగి సీఎం దగ్గరకు వెళితే మంత్రి మరింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.