టీడీపీలో పీటముడి
సాక్షిప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో పీటముడి పడింది. స్థానిక సమస్యల కోటా కింద సిట్టింగ్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి అవకాశం దక్కుతుందని భావిస్తున్న తరుణంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్లు అనూహ్యంగా తెరమీదకు వచ్చాయి. దీంతో అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ అధిష్టాన వర్గం అనేక రకాల సమీకరణాలను సరిచూస్తూ కసరత్తు ప్రారంభించింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్న వాకాటి నారాయణరెడ్డిని శాసనమండలి డెప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు పార్టీలోకి ఆహ్వానించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న నారాయణరెడ్డి పార్టీ మారి టీడీపీ అభ్యర్థి ఎస్‌వీ సతీష్‌కుమార్‌రెడ్డికి మద్దతు ఇచ్చారు. అప్పట్లో ఎలాంటి షరతు లేకుండా తాను పార్టీలోకి వచ్చినందు వల్ల మరోసారి తనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని నారాయణరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఇప్పటికే అనేక సార్లు తమ కోరికను విన్నవించారు.
నారాయణరెడ్డికే అవకాశం దక్కవచ్చని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు భావిస్తూ వచ్చారు. అయితే ఈ ఎన్నికకు సమయం దగ్గర పడటంతో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఈ పదవికి పోటీలో నిలిచారు. 2014 ఎన్నికల సమయంలో తాను కూడా చంద్రబాబునాయుడు ఆహ్వానం మేరకు పార్టీలోకి చేరి ఎంపీగా పోటీ చేశానని ఆదాల హైకమాండ్ దృష్టికి తీసుకుని పోయారు. ఆ ఎన్నికలలో ఓడినా తనను రాజ్యసభకు పంపుతానని అప్పట్లో హామీ ఇచ్చినందు వల్ల రాజ్యసభకు బదులు శాసనమండలికి అవకాశం కల్పించాలని ఆదాల డిమాండ్ చేస్తున్నారు. కాగా, నెల్లూరులో పార్టీని బలోపేతం చేయడం కోసం సీఎం ఆహ్వానం మేరకు తాము పార్టీలోకి వచ్చామని.. నగరంలో తమ రాజకీయ ప్రాధాన్యత, పార్టీపటిష్టత కోసం ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇవ్వాలని ఆనం వివేకానందరెడ్డి కోరుతున్నారు.
ఈ విషయం గురించి వివేకా ఇప్పటికే మంత్రి నారాయణ మద్దతు కోసం ప్రయత్నించారు. ఇటీవల ఆయన నెల్లూరులో మంత్రి క్యాంప్ ఆఫీసుకు వెళ్ళి సుమారు అరగంట సేపు ఈ విషయంపై చర్చించారు. తన మనసులో కోరికను చంద్రబాబునాయుడు చెవిలో కూడా వేశారు. ఎమ్మెల్సీ స్థానాన్ని వాకాటి మాత్రమే కోరుతున్నందు వల్ల ఈ ఎంపికలో పోటీ ఉండదని భావించిన సీఎం చంద్రబాబునాయుడుకు ఇదో పెద్ద సమస్యగా మారింది. టికెట్ ఆశిస్తున్న ముగ్గురిని తామే పార్టీలోకి ఆహ్వానించినందు వలన ఇప్పుడు ఎవరికి అవకాశం ఇవ్వాలో తేల్చుకోలేక పోతున్నారు. అభ్యర్థి ఎంపిక గురించి చంద్రబాబు మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రలతో ప్రాథమికంగా చర్చించారు. వారం పదిరోజుల్లో స్థానిక సంస్థల అభ్యర్థులతో పాటు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు.