జిల్లాను నంబర్ వన్ చేస్తాం
-
పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు
జనగామ : అభివృద్ధిలో రాష్ట్రంలోనే జనగామ జిల్లాను నంబర్ వన్ చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి ఆయన గురువారం హైదరాబాద్ నుంచి జనగామకు వచ్చారు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో జనగామను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. దేవాదుల ద్వారా చెరువులకు నీటిని మళ్లించి 365 రోజులూ మత్తడి దుంకేలా చేస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ జనగామ జిల్లా ఇచ్చేందుకు మొదటి నుంచే సుముఖంగా ఉండగా చేర్యాల, మద్దూరు, గుండాల, స్టేషన్ ఘన్‌పూర్, జఫర్‌గఢ్ మండలాల వారు కలువమంటున్నరు.. జనాభా సరిపోవడం లేదనేవారని తెలిపారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జేఏసీ నాయకులు జనగామ జిల్లా ఇవ్వాల్సిందేనని ఖరాకండిగా చెప్పడంతో మిగతా జిల్లాల సంగతి ఎలా? అని కేసీఆర్ ప్రశ్నించారని తెలిపారు. గతంలో జనగామను జిల్లాగా చేస్తానని మాట ఇచ్చారని, మిగతా వాటిపై హామీ ఇవ్వలేదనడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని వివరించారు. జిల్లా అభివృద్ధికి అందరి సహకరించాలని కాంక్షించారు. ఉద్యమంలో కలిసి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నాగారపు వెంకట్, డాక్టర్లు లక్షి్మనారాయణనాయక్, రాజమౌళి, పజ్జూరి గోపయ్య, పోకల లింగయ్య, మాశెట్టి వెంకన్న బొట్ల శ్రీనివాస్, ఆకుల సతీష్, బండ యాదగిరిరెడ్డి, కారింగుల రఘువీరారెడ్డి, మంగళ్లపల్లి రాజు, ఉడుగుల రమేష్, కొండా కిరణ్, బెడిదె మైసయ్య, కన్నారపు ఉపేందర్, పెట్లోజు సోమేశ్వరాచారి, విజయ్ ఉన్నారు.