తొలి తూటాకు ఏడాది | The first bullet of the year | Sakshi
Sakshi News home page

తొలి తూటాకు ఏడాది

Published Thu, Sep 15 2016 12:37 AM | Last Updated on Fri, Oct 5 2018 9:08 PM

తొలి తూటాకు ఏడాది - Sakshi

తొలి తూటాకు ఏడాది

తెలంగాణ రాష్ట్రంలో తొలి ఎన్‌కౌంటర్‌ జరిగి ఏడాది గడిచింది. సరిగ్గా ఏడాది క్రితం(2015, సెప్టెంబరు 15) వరంగల్‌ జిల్లా తాడ్వాయి అడవుల్లో మొద్దులగుట్ట వద్ద ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టు పార్టీకి చెందిన తంగెళ్ల శృతి(27) అలియాస్‌ మహిత, మణికంటి విద్యాసాగర్‌రెడ్డి(27) అలియాస్‌ సాగర్‌ ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.

  • మెుద్దులగుట్ట ఎన్‌కౌంటర్‌ జరిగి సంవత్సరం
  •  తెలంగాణలో తొలి ఎన్‌కౌంటర్‌
  •  మావోయిస్టు పార్టీకి చెందిన శృతి, సాగర్‌ మృతి
  •  అప్పటి నుంచి పూర్తిగా తగ్గిన మావోయిస్టు కార్యకలాపాలు
  •   ఎన్‌కౌంటర్‌పై ఇంకా ముగియని మెజిస్ట్రీయల్‌ విచారణ
  • ములుగు : తెలంగాణ రాష్ట్రంలో తొలి ఎన్‌కౌంటర్‌ జరిగి ఏడాది గడిచింది. సరిగ్గా ఏడాది క్రితం(2015, సెప్టెంబరు 15) వరంగల్‌ జిల్లా తాడ్వాయి అడవుల్లో మొద్దులగుట్ట వద్ద ఎన్‌కౌంటర్‌ జరిగింది. మావోయిస్టు పార్టీకి చెందిన తంగెళ్ల శృతి(27) అలియాస్‌ మహిత, మణికంటి విద్యాసాగర్‌రెడ్డి(27) అలియాస్‌ సాగర్‌ ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. వీరిద్దరు వరంగల్‌ జిల్లాకు చెందిన వీరు ఎన్‌కౌంటర్‌కు కొన్ని నెలల ముందే మావోయిస్టు పార్టీలో చేరారు.
     
    ఛత్తీస్‌గఢ్‌ నుంచి గోదావరి తీరం దాటి వరంగల్‌ జిల్లాలోకి వచ్చిన ఇద్దరినీ కొన్ని రోజుల్లోనే ఎన్‌కౌంటర్‌ చేసినట్లు పోలీసు వర్గాలు అప్పట్లో తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్‌కౌంటర్‌ కావడంతో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మావోయిస్టు పార్టీకి సంబంధించి రాష్ట్రంలో పూర్తిగా కోలుకోలేని దెబ్బ తగిలింది. వరంగల్‌ జిల్లాలో గతంలో 2009 అక్టోబరులో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇదే చివరి ఎన్‌కౌంటర్‌. గత ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు కార్యకలాపాలు మళ్లీ మొదలయ్యాయని భావించారు. ఆ తర్వాత ఎలాంటి కార్యకలాపాలూ జరగకపోవడంతో మావోయిస్టుల ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని ప్రజల్లో చర్చ జరుగుతోంది.
     
    ప్రస్తుతం ప్రశాంతం...
    వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలం మొద్దులగుట్ట ఎన్‌కౌంటర్‌ తర్వాత ఏజెన్సీ ప్రాంతం కొన్ని నెలలపాటు స్తబ్ధత నెలకొంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో తాడ్వాయి మండల కేంద్రంలోని అటవీశాఖ కుటీరాన్ని, జీపు దగ్ధం చేశారు. ఇది తామే చేశామని మావోయిస్టుల పేరుతో అక్కడ లేఖ దొరికింది. మే నెలలో ములుగు మండలం మల్లంపల్లి ఎర్రమట్టి క్వారీలో జేసీబీని దగ్ధం చేశారు. మావోయిస్టు పార్టీ ఖమ్మం–కరీంనగర్‌–వరంగల్‌(కేకేడబ్ల్యూ) కార్యదర్శి దామోదర్‌ పేరుతో వాల్‌పోస్టర్లు వెలిశాయి. తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. మావోయిస్టు యాక్షన్‌ టీం దళకమాండర్‌ బుట్టాయిగూడెంకు చెందిన మధు అలియాస్‌ కుమ్మరి సడవలయ్యను అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఎలాంటి సంఘటనలూ జరగలేదు. 
     
    కొనసాగుతున్న విచారణ...
    మొద్దులగుట్ట ఎన్‌కౌంటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం మెజిస్ట్రీయల్‌ విచారణకు ఆదేశించింది. ములుగు రెవెన్యూ డివిజనల్‌ అధికారి నేతృత్వంలో ఈ విచారణ జరుగుతోంది. ఇప్పటికి రెండుసార్లు ఈ కేసును విచారించారు. శృతి తల్లిదండ్రులు తంగెళ్ల సుదర్శన్‌–రమాదేవి, విద్యాసాగర్‌ తండ్రి మణికంటి సుధాకర్‌రెడ్డి, పలువురు ప్రజాసంఘాల నేతలు విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.
     
    త్వరలో పూర్తి : చీమలపాటి మహేందర్‌జీ, ములుగు ఆర్డీవో.
    మొద్దుగుట్ట ఎన్‌కౌంటర్‌పై విచారణ కొనసాగుతోంది. మృతుల తల్లిదండ్రులు, మానహక్కుల సంఘాలు, ప్రజాస్వామిక సంఘాల సభ్యులు, ఇద్దరు తహసీల్దార్లలోపాటు రంగాపురం, చల్వాయి గ్రామస్తులు, ఇద్దరు పోలీసులను రెండుసార్లు విచారించాం. శృతి, విద్యాసాగర్‌రెడ్డి మృతదేహాలను పోస్టుమార్టం చేసిన వైద్యులను, పంచనామా నిర్వహించిన రెవెన్యూ సిబ్బందిని, పోలీస్‌ అధికారులను విచారిచాల్సి ఉంది. ఇద్దరు వైద్యుల్లో ఒకరు అందుబాటులో లేరు. 15 రోజుల్లో విచారణ పూర్తి చేస్తాం. 
     
    సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి : తంగెళ్ల సుదర్శన్, శృతి తండ్రి 
    శృతిని పట్టుకుని క్రూరంగా హింసించి హత్య చేశారు. హింసించక పోతే శరీరంపై గాయాలు ఎలా ఏర్పడుతాయి? చేయి ఎలా విరిగింది? ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరముంది. సిట్టింగ్‌ జడ్జీతో విచారణ జరిపితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. మన రాష్ట్రం... మన ప్రభుత్వం అనుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో శృతి చురుకుగా పాల్గొన్నది. రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ప్రజలను ఉద్యమంలో పాల్గొనేలా చేసింది. సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని తపించింది. ఈ దిశగా ముందుకు పోతున్న శృతిని అకారణంగా హత్య చేశారు. ఎలాంటి కార్యకలాపాలకూ పాల్పడకపోయినా శృతిని, సాగర్‌ను క్రూరంగా చంపారు. వీరిద్దరిని చంపిన వారిని నరహంతక ప్రభుత్వం ఇప్పటికీ శిక్షించలేదు. ప్రభుత్వంలో మార్పు లేదు. ప్రజలు కోరుకునే విధంగా నడుస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో భిన్నంగా నడుచుకుంటోంది. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది. శృతి, సాగర్‌ ఎన్‌కౌంటర్‌లపై ప్రజలకు జవాబు చెప్పాలి. 
     
     
    కొడుకును శవంగా అప్పజెప్పిండ్రు : మణికంటి సుధాకర్‌రెడ్డి, సాగర్‌ తండ్రి 
    నాకొడుకు సాగర్‌ పేదలకు ఒక న్యాయం పైసలు ఉన్నోల్లకు ఒక న్యాయం జరుగుతుందనిlఎప్పటికీ అనేటోడు. రెండుమూడు సార్లు ఈ విషయంపై గ్రామంలోని కొంతమందికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు గొడవపడ్డారు. ఎప్పుడూ ఎటోపోయోటోడో... వచ్చేటోడు. ఎందిబిడ్డా అంటే నాకేంగాదు బాపు నువ్వు ఊకో అనేటోడు. సాగర్‌ ఎన్‌కౌంటర్‌ కన్నా ముందు ఎనిమిది నెలల కిందనే దళంకు పోయిండని తెలిసింది. తరువాత ఆరోగ్యం సక్కగ ఉంటలేదని లొంగిపోయిండు. తరువాత కొన్ని రోజులు ఫర్టిలైజర్‌ షాపు పెట్టుకుని ఉన్నడు. కొన్ని నెలల తరువాత తిరిగి దళంలకు పోయిండని తెలువంగనే చాలాసార్లు ఫోన్‌ చేసినా కలువలేదు. అప్పటి నుండి రెండున్నర నెలల తరువాత శవంగా ఇంటికి వచ్చిండు. నా కొడుకు నాకు తలకొరివి పెడుతడనుకుంటే... నాతోనే తలకొరివి పెట్టించుకున్నడు. నా కొడుకును పోలీసులు చిత్రహింసలు పెట్టి సంపిండ్రు. అప్పుడు శవాన్ని చూసేందుకు పోలీసులు పోస్ట్‌మార్టం రూంలకు పోనియ్యలే. పోస్ట్‌మార్టం అయినంక చూస్తే శరీరం మొత్తం దెబ్బలే కనిపించినయి. అన్యాయంగా నాకొడుకును పోలీసులు, రాజకీయనాయకులు కలిసి పొట్టనబెట్టుకున్నరు. ఇక్కడున్న కొంతమంది స్థానిక నాయకులే... నాకొడుకు దళంలకు పోవటానికి కారణమయ్యారు. నాకు ఎటువంటి ఆధారమూ లేదు, రెండు బర్లు ఉన్నాయి. వాటి పాలపై వచ్చే ఆదాయంతో నేను, నా తల్లి బతుకుతున్నాము. సాగర్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఐదు నెలల తర్వాత నా భార్య లత గుండెపోటుతో మృతిచెందింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement