అమలుకు నోచని హామీలు
► ఆందోళనబాట పడుతున్న కార్మికులు
సింగరేణిలో ప్రస్తుతం తీవ్రమైన ప్రతిష్టంభన నెలకొంది. గతంలోని సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా.. కొత్తవి వచ్చి పడుతుండటంతో సంస్థ గడ్డుకాలా న్ని ఎదుర్కొంటోంది. సాక్షాత్తు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకే దిక్కులేకపోగా.. ఇక మిగిలిన సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించడం అత్యాశే అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడేళ్ల క్రితం ఎన్నికల సమయంలో కేసీఆర్ సింగరేణి కార్మిక కుటుం బాలకు ఇచ్చిన పలు వాగ్దానాలు సంస్థలో కొత్త చిక్కులు తెచ్చిన పరిస్థితి.. దానిలో భాగంగా వారసత్వ ఉద్యోగాల విషయం ప్రస్తుతం సింగరేణిలో సమ్మెకు కారణమైంది.
కోల్‌బెల్ట్(భూపాలపల్లి): సార్వత్రిక ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులకు సంబంధించి.. అనేక హామీలు ఇచ్చారు. అయితే అందులో కొన్నింటిని విస్మరించారు. కొన్నింటిని అమలు చేసేం దుకు చర్యలు ప్రారంభించగా.. పూర్తిస్తాయిలో ముందుకు తీసుకెళ్లలేకపోయారు. గత ఏడాది దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించా రు. తర్వాత వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్‌ను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయి. దీంతో వారసత్వ ఉద్యోగ సమస్య మళ్లీ మొదటికొచ్చింది. అలాగే సకలజనుల సమ్మె వేతనాలను కొంతమంది కార్మికులకు ఇప్పటివరకు చెల్లించలేదు.
కాంట్రాక్ట్ కార్మికుల విషయానికి వస్తే సింగరేణిలో సుమారు 25వేల మంది పనిచేస్తుండగా.. వారిని క్రమబద్ధీకరించపోగా.. హైపవర్ కమిటీ వేతనాలను చెల్లించాలని కోర్టు ఆదేశించినా.. నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని పరిస్థితి నెలకొంది. బొగ్గు రంగ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు చేయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పలుమార్లు కార్మిక సం ఘాలు చేపట్టిన ఆందోళనల మేరకు అసెంబ్లీలో తీర్మా నం చేసి పార్లమెంట్‌కు పంపారే తప్ప అక్కడ పరిష్కార మార్గంకోసం టీఆర్‌ఎస్ ఎంపీలు చొరవ చూపలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక కుటుం బాలకు మెరుగైన వైద్యం అందించటం కోసం జిల్లాకో మెడికల్ కాలేజీ నెలకొల్పి సేవలను విస్తృతం చేస్తామని ఇచ్చిన వాగ్ధానాన్ని కూడా సీఎం కేసీఆర్ విస్మరించారని కార్మికులు ఆరోపిస్తున్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ మాట అటుంచితే ప్రస్తుతం ఉన్న సింగరేణి ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందక కార్మిక కుటుం బాలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న పరి స్థితి నెలకొంది.
పలు కారణాలతో డిస్మిస్ అయిన కార్మికులకు తిరిగి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పిన కేసీఆర్ మూడేళ్లలో కేవలం 450మందికి మాత్రమే ఉద్యోగం కల్పిం చారు. మిగిలిన వారిని విస్మరించారు. ఇప్పటికీ పలు ఏరియాల్లో డిస్మిస్డ్ కార్మికులకు తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సగం సగం అమలు చేస్తుండటంతో కార్మికులు తీవ్ర అసంతృత్తితో ఉన్నారు. తమ హక్కుల సాధనకోసం ఆందోళలను సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా వారసత్వ ఉద్యోగాల కోసం ఈనెల 15నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. మిగతా హామీలపై ప్రభుత్వం స్పం దించకుంటే కార్మిక సంఘాల నాయకత్వంలో ఆందోళన బాట పట్టే ఆలోచనలో ఉన్నారు.