బిడ్డా.. అన్నం పెడతా రా!
♦ ఇంట్లోకి తీసుకెళ్లి కుమారుడికి ఉరి వేసిన తల్లి
♦ అనంతరం తానూ ఆత్మహత్య
♦ కీడును శంకించి తప్పించుకున్న మరో కుమారుడు
యాలాల: బిడ్డా.. గుడ్డు, అన్నం పెడతాను రా.. అంటూ తన ఇద్దరు కొడుకులను ఇంట్లోకి తీసుకెళ్లిందో తల్లి. పథకం ప్రకారం ఉరి వేసేందుకు తాడు సిద్ధం చేస్తుండగా కీడును శంకించిన ఓ కుమారుడు భయపడి బయటకు పరుగులు తీశాడు. అయితే, మరో కొడుకుకు ఉరివేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం ఎన్కెపల్లిలో సోమవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన నీళ్లపల్లి గోపాల్, బుజ్జమ్మ (35) దంపతులకు గౌతమ్, రాకేష్(5) సంతానం. కుటుంబ కలహాలతో బుజ్జమ్మ నాలుగే ళ్ల క్రితం తన పుట్టింటికి వెళ్లింది. దీంతో మూడేళ్ల క్రితం గోపాల్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న బుజ్జమ్మ కొంతకాలం క్రితం అత్తగారింటికి వచ్చింది. నెలరోజుల క్రితం గోపాల్ రెండో భార్యతో కలసి నగరానికి వలస వెళ్లాడు. ఇదిలా ఉండగా, ఆదివారం సాయంత్రం బుజ్జమ్మ అన్నం, గుడ్డు పెడతానని కొడుకులను ఇంట్లోకి తీసుకెళ్లింది. దూలానికి తాడుతో ఉరి బిగిస్తుండగా విషయం గుర్తించిన గౌతమ్ బయటకు పరుగులు తీశాడు. అనంతరం ఆమె తలుపులకు గొళ్లెం వేసి చిన్న కొడుకు రాకేష్ మెడకు ఉరేసి చంపింది. అనంతరం బుజ్జమ్మ దూలానికి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. షాక్‌కు గురైన గౌతమ్ కొద్దిసేపటి తర్వాత పొలం నుంచి వచ్చిన నానమ్మ, తాతయ్యలకు జరిగిన విషయాన్ని చెప్పాడు. సమాచారం అందుకున్న తాండూరు రూరల్ సీఐ సైదిరెడ్డి, ఎస్‌ఐ అరుణ్‌కుమార్ రాత్రి గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. అయితే, గౌతమ్ బయటకు పరుగులు తీయకపోయి ఉంటే బుజ్జమ్మ అతడిని కూడా చంపేసి ఉండేదని పోలీసులు తెలిపారు.