మద్యం మత్తులో ప్రాణ స్నేహితుడినే పొడిచి చంపిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్‌నగర్ చేపల మార్కెట్ సమీపంలో నివాసం ఉండే కల్కొడ సంధ్యారాజ్(28), అదే ప్రాంతంలో నివసిస్తున్న ఆవుల చంద్రశేఖర్ అలియాస్ చందు(29), రమేష్ అలియాస్ బిజ్జు (28) మంచి స్నేహితులు.
ఈ ముగ్గురూ కలిసి గురువారం రాత్రి స్థానికంగా ఓ వైన్‌షాప్ వద్ద మద్యం తాగారు. అయితే, తాగిన మద్యం సరిపోలేదని మళ్లీ తాగుదామని నిర్ణయించుకున్నారు. డబ్బుల్లేకపోవటంతో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చందు తన ఇంట్లో సిలిండర్‌ను సమీపంలో ఉన్న ఓ హోటల్‌లో తనఖా పెట్టి వెయ్యి రూపాయలు తీసుకున్నాడు. ఆ డబ్బుతో మద్యం కొనుగోలు చేసి, తన ఇంట్లోనే స్నేహితులతో కలసి తాగటం మొదలు పెట్టారు.
ఈ సమయంలో బిజ్జు, సంధ్యారాజ్ గొడవపడ్డారు. పరస్పరం కొట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న బిజ్జు బాటిల్ పగలగొట్టి సంధ్యారాజ్‌ను పొడిచాడు. చెవి నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది. చేతులు, కడుపులో కూడా గాట్లు పడ్డాయి. అనంతరం చందు, బిజ్జు అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు కుటుంబ సభ్యులు చూసేసరికి పైన రక్తపుమడుగులో సంధ్యారాజ్ విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పరారీలో ఉన్న చందు, బిజ్జులను అరెస్ట్ చేశారు. అకారణంగా గొడవపడ్డారని మాటామాటా పెరిగి ఘటన దాడికి దారి తీసిందని పోలీసులు వెల్లడించారు. నిందితులపై హత్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.