రిజర్వేషన్ బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందే
l మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ డిమాండ్
l తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా
ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : మతపరమైన రిజర్వేషన్‌లు రాజ్యాంగ విరుద్ధమని, ముస్లిం రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌కు ముస్లింల అభివృద్ధిపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వారు వెనుకబడడానికి గల కారణాలు విశ్లేషించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలకు ముందు అందిరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు అని చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు కులాల ప్రాతిపదికన విభజిస్తున్నారని విమర్శించారు.
ముస్లింలకు రిజర్వేషన్ల బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం నగరంలోని నిజామాబాద్ సౌత్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. మతపరమైన రిజర్వేషన్లు ప్రవేశపెట్టవద్దని అంబేద్కర్, గాంధీజీలే ఆనాడు చెప్పారని, కానీ రాజ్యంగానికి విరుద్ధంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం సరికాదన్నారు. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్తున్న సీఎం కేసీఆర్‌ను ప్రజలు తమిళనాడుకే తరుముతారని హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక మన నాయకులు, మన పాలన ఉంటుందని ప్రజలు అనున్నారు కానీ ఇలా కుట్రపూరితమైన నాయకులు వస్తారని ఊహించలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోచేతికి బెల్లం పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కేంద్ర అభివృద్ధి పథకాలను అమలు చేయడంపై పెట్టని దృష్టి రిజర్వేషన్లపై ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.
మహిళలను మంత్రి వర్గంలో చేర్చకుండా ముస్లిం రిజర్వేషన్‌ల బిల్లు పెట్టడం వెనుక కుట్ర ఉందని, 50 శాతం మహిళలున్న రాష్ట్రంలో మహిళలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించి మహిళా సాధికారతకు పాటు పడాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ సుదర్శన్‌ను కలిసి రిజర్వేషన్ బిల్లు వెనక్కు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. బీజేసీ నగర పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, స్వామీయాదవ్, నేతలు సూర్యనారాయణ, బాల్‌రాజ్, గోపాల్, సుధాకర్, రాజు, సుగుణ, గంగాధర్, శోభ, నాగరాజ్, అమృతారెడ్డి, దేవేందర్, భూపతి, నరేశ్, సాయి, ప్రజ్వాల్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.