
వెల్డింగ్ కోసం ఉపయోగించిన సిలిండర్
సాక్షి, సిటీబ్యూరో: మళ్లీ అదే నిర్లక్ష్యం.. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద మ్యాన్‌హోల్‌లో దిగి నలుగురు కార్మికులు మృత్యువాత పడిన ఘోర దుర్ఘటనను మరువకముందే గురువారం సఫిల్‌గూడలో మరో నలుగురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. జలమండలి పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ప్రమాదాల తీరును పరిశీలిస్తే పనులు చేపట్టిన సంస్థలు, గుత్తేదారులు కార్మికుల ప్రాణాల రక్షణకు భద్రతా చర్యలు తీసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడమే కారణంగా కనిపిస్తోంది. నూతనంగా నిర్మిస్తున్న మంచినీటి పైప్‌లైన్ జాయింట్‌లకు గ్యాస్ వెల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్‌పైప్ లీకై మంటలు వ్యాపించాయి.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సాధారణంగా వెల్డింగ్‌కు ఉపయోగించే వాణిజ్య విభాగం గ్యాస్‌కిట్ (వెల్డింగ్ గ్యాస్‌కిట్) కాకుండా గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్‌ను వినియోగించడమే ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. మైల్డ్‌స్టీల్‌తో తయారు చేసిన ఈ భారీ పైప్‌లైన్‌కు జాయింట్ వేసే క్రమంలో కనీసం ఆక్సిజన్ సిలిండర్లు, అగ్ని నిరోధక దుస్తులు, బూట్లు, హెడ్‌లైట్, టార్చ్ వంటి ఉపకరణాలేవీ లేకుండా నేరుగా పైప్‌లైన్‌లోనికి కార్మికులను దించడంతోనే ప్రమాదం సంభవించినట్టు స్పష్టమవుతోంది.
ఆగడాలకు అడ్డుకట్ట ఏదీ?
జలమండలి పరిధిలో ఏటా సుమారు రూ.100 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు, నిర్వహణ పనులు జరుగుతుంటాయి. మల్కాజ్‌గిరి ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన రూ.300 కోట్లతో మంచినీటి సరఫరా వ్యవస్థ పనులు జరుగుతున్నాయి. ఇవి తుది దశకు చేరుకున్నాయి. పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టు సంస్థలు ఉపగుత్తేదారులకు ఇచ్చి పనులు చేపడుతున్నాయి. ప్రధాన ఏజెన్సీలు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 30 శాతం లాభం రాబట్టుకొని మిగతా మొత్తానికి సబ్ కాంట్రాక్టులిచ్చి చేతులు దులుపుకున్నట్లు సమాచారం.
ప్రధాన ఏజెన్సీల పర్యవేక్షణ లేకపోవడం... నిపుణులతో అవసరమైన సలహాలు, సూచనలు అందించకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతుండడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. మరో వైపు సబ్‌కాంట్రాక్టులు పొందిన కాంట్రాక్టర్లు తమ లాభం తగ్గుతుందనే భావనతో భద్రతా ఉపకరణాల కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కార్మికుల ప్రాణాలు గాలిలో దీపంలా మారుతుండడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
ఈ దుర్ఘటనకు కారణమైన కాంట్రాక్టర్లు, ప్రధాన ఏజెన్సీలు, పర్యవేక్షించని జలమండలి క్షేత్రస్థాయి అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భద్రతా ఉపకరణాలు లేకుండా కార్మికులను పనిలోకి దించడాన్ని నిరోధించాలని కోరుతున్నాయి. గాయాలపాలైన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని అవి డిమాండ్ చేస్తున్నాయి.
జీఎం సరెండర్
సఫిల్‌గూడ దుర్ఘటనకు బాధ్యులపై క్రిమినల్ కేసులు
సాక్షి, సిటీబ్యూరో: ఈనెల 13న మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వద్ద మ్యాన్‌హోల్‌లోకి దిగి నలుగురు కార్మికులు మృతిచెందిన ఘటనకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక అందేవరకు ప్రాజెక్టు విభాగం జనరల్ మేనేజర్(పీడీ–8) సుదర్శన్‌ను బోర్డు ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేసినట్లు జలమండలి ఎమ్‌డీ దానకిశోర్ తెలిపారు. ఈ దుర్ఘటనపై జలమండలి శాఖాపరమైన విచారణ నివేదికలో పనులు చేపట్టిన జీఎస్‌కే సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలిందన్నారు.
అలాగే గురువారం సఫిల్‌గూడ వద్ద పైపులైన్ జాయింట్ వెల్డింగ్ పనుల్లో గ్యాస్‌పైపు లీకైన నలుగురు కార్మికులు గాయాల పాలైన ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ఎమ్‌డీ స్పష్టం చేశారు. కార్మికుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం జలమండలి పరిధిలో నిర్వహణ, ప్రాజెక్టు పనులు చేపడుతున్న ప్రధాన ఏజెన్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.