
భయం...భయం
విజయనగరం కంటోన్మెంట్/క్రైం : అందరిలో ఒకటే టెన్షన్... ఏ క్షణం ఏమవుతుందోనని భయాందోళన... ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు... బతికితే చాలు దేవుడా అంటూ ప్రార్థనలు చేశారు...పోలీసులు తీవ్ర హైరానాకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి నుంచి పరుగులు పెట్టారు. జిల్లా అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. 40 టన్నుల బరువున్న గ్యాస్ ట్యాంకర్ ఆర్‌అండ్‌బీ కూడలి వద్ద మలుపులో పెద్ద శబ్దంతో బోల్తాపడి, అందులోంచి గ్యాస్ లీక్ అవుతోందన్న సమాచారం తెలిసిన వెంటనే ఇటు పోలీసులు, అటు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను అటు వైపుగా వెళ్లకుండా నిరోధించారు.
ట్యాంకర్ పేలితే సుమారు కిలోమీటర్ దూరం వరకూ పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఐఓసీ అధికారులు తెలపడంతో మరింత అప్రమత్తమైన పోలీసులు వెంటనే ట్రాఫిక్‌ను మళ్లించారు. రెవెన్యూ, అటవీ, అగ్నిమాపక, మున్సిపల్ అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. చుట్టపక్కల ఉన్న హోటళ్లు, పాఠశాలలు, దుకాణాలు, రైతుబజార్లు, కార్యాలయాలను మూయించి వేశారు. దూరంగా వెళ్లమంటూ మైకుల్లో ప్రచారం చేశారు. పోలీసులు ముందు జాగ్రత్తగా తీసుకున్న చర్యలతో ప్రజలు ఏమవుతుందోనని ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు. చాలా మంది బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు.
సంఘటన పూర్వాపరాలివి
పట్టణంలోని ఆర్‌అండ్‌బీ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత గ్యాస్‌తో వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి రాయపూర్‌కు గ్యాస్ ట్యాంకర్ సుమారు 40 టన్నుల లోడ్‌తో వెళ్తోంది. ఆర్‌అండ్‌బీ రహదారి జంక్షన్ జాతీయ రహదారి 26 మలుపు వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి పెద్ద శబ్దంతో బోల్తాపడింది. ట్యాంకర్ బోల్తా పడిన వెంటనే డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ ఎస్.అమ్మినాయుడుకు సమాచారం అందడంతో వెంటనే ట్రాఫిక్ సీఐ ఎ.రవికమార్‌కు సమాచారమందించారు.
ట్రాఫిక్ పోలీసులు ట్యాంకర్ వద్దకు వెళ్లి చూడగా గ్యాస్ ప్రమాణాన్ని నిర్దేశించే మీటర్ (ప్రెజర్ వాల్వ్) ఊడిపోవడంతో అందులో నుంచి గ్యాస్ లీకైంది. వేకువ జామున సమీపంలోని దుకాణం వద్ద నుంచి తెచ్చిన గోధుమపిండి ముద్దను లీకవుతున్న వాల్వ్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటించాడు. కొంతవరకు గ్యాస్ లీకవ్వడం తగ్గింది. మంగళవారం ఉదయాన్నే గ్యాస్ లీకవుతున్న ప్రాంతం వద్ద ఎంసీల్ వేశారు. ఉదయం 6 గంటలకు ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.జయప్రకాష్, సహాయ అగ్నిమాపక అధికారి కె.వి.టి.ప్రసాద్‌రావు, పట్టణ అగ్నిమాపక అధికారి ఎస్.దిలీప్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మంటలు చెలరేగితే ఆర్పేందుకు ఫామ్ వాటర్‌ను సిద్ధంగా ఉంచారు. వెంటనే విశాఖపట్నంలో ఉన్న ఐఓసీ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం పది గంటల వరకూ ఆ రోడ్డులో వాహనాల రాకపోక లు సాగించాయి.
ఐఓసీ అధికారుల సమాచారంతో భీతిల్లిన జనం
గ్యాస్ ట్యాంకర్ పెలితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఐఓసీ అధికారులు చెప్పడంతో అధికారులందరూ ఒక్కసారిగా అప్రమత్తయ్యారు. ఆ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పోలయ్యపేట మలుపు వద్ద బోర్డులు పెట్టి వాహనాలను మళ్లించారు. డీఎస్పీ ఎస్.శ్రీనువాస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ రవికుమార్ ఆర్‌అండ్‌బీ జంక్షన్ నాలుగు వైపుల వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆర్‌అండ్‌బీ సమీపంలో ఉన్న వ్యాపార సముదపాయాలు, పాఠశాలలు, రైతు బజార్లను, ఇళ్లల్లో ఉన్నవారిని దూరంగా వెళ్లిపోవాలని మైకులో ప్రచారం చేశారు. ఆర్‌అండ్‌బీకి కిలోమీటర్ దూరంలో ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గ్యాస్ ట్యాంకర్ పడిన ప్రాంతంలో ఎవరూ సిగరెట్ తాగరాదని, సెల్‌ఫోన్లు వినియోగించరాదని, నిప్పు రగిలించే ఏ వస్తువులు వాడకుండా ఉండాలని సూచించారు.
ఆలస్యంగా వచ్చిన ఐఓసీ అధికారులు
గ్యాస్ ట్యాంకర్‌ను పరిశీలించడానికి ఐఓసీ అధికారులు సంఘటన స్థలానికి ఆలస్యంగా చేరుకున్నారు. ఉదయం 7.30 నుంచి ఐఓసీ అధికారులకు ట్రాఫిక్ సీఐ ఎ.రవికుమార్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.జయప్రసాద్‌లు ఫోన్లో సంప్రదిస్తున్నా అదిగో వస్తున్నాం..ఇదిగో వస్తున్నాం.. అంటూ కాలయాపన చేశారు. 11 గంటల ప్రాం తంలో ఐఓసీ అధికారులు శివరామకృష్ణ తదితరులు వచ్చి బోల్తాపడిన గ్యాస్ ట్యాంకర్‌ను పరి శీలించారు. ప్రస్తుతానికి ప్రమాదం లేదని, ఒక వేళ గ్యాస్ లీకయితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు చెప్పడంతో ప్రజలను దూర ప్రాం తాలకు వెళ్లాలని సూచించారు.
40 టన్నుల బరువు
గ్యాస్ ట్యాంకర్ లారీ బరువు సుమారు 40 టన్నులు ఉంటుందని అంచనా వేశారు. ఐఓసీ గ్యాస్ సరఫరా చేస్తున్న ట్యాంకర్ సామర్థ్యం 32 టన్నులని అధికారికంగా చెప్పినప్పటికీ ట్యాంకర్‌లో అధికస్థాయిలో గ్యాస్ ఫిల్లింగ్ చేసి ఉండవచ్చని, అందుకే వేగంగా వెళ్తున్న ట్యాంకర్ మలుపు వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడిందని భావిస్తున్నారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు..
సంఘటన విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటవెంటనే చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ప్రజలను, సమీపంలోని దుకాణదారులను అప్రమత్తం చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును, తొలగించే ఏర్పాట్లు ఏవిధంగా చేస్తున్నారని డీఎస్పీ ఎస్.శ్రీనువాస్‌ను అడిగితెలుసుకున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఎ.జయప్రకాష్, సహాయ అగ్నిమాపక అధికారి కె.వి.టి.ప్రసాదరావు, పట్టణ అగ్నిమాపక అధికారి ఎస్.దిలీప్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. ఆ శాఖకు చెందిన 40 మంది సిబ్బంది సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రెండు అగ్నిమాపక శకటాలను సిద్ధంగా ఉంచారు. ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి గణపతి, మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావు, ఎన్‌హెచ్‌ఎ రోడ్ల ఎస్‌ఐ పి.డి.విజయ్‌కుమా ర్, ఆర్టీసీ డిపో మేనేజర్ పద్మావతి, ఇండియన్ రెడ్‌క్రాస్ చైర్మన్ హేమసుందర్ ఆదేశాల మేరకు విపత్తుల నివారణ జిల్లా అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది సూర్యప్రకాష్, రామకృష్ణ, మురళీ ప్రజలను అప్రమత్తం చేశారు.
పైకి ఎత్తలేకపోయిన మూడు క్రేన్‌లు
బోల్తాపడిన గ్యాస్ ట్యాంకర్‌ను పైకి ఎత్తేందుకు జిల్లా అధికారులు అందుబాటులో ఉన్న క్రేన్‌లను తెప్పించా రు. విజయనగరంలో ఉన్న 14 టన్నులు ఒకటి, 12 టన్నుల సామర్థ్యం ఉన్న రెండు క్రేన్‌లను అధికారులు రప్పించారు. ఈ మూడు క్రేన్‌లు బోల్తాపడిన లారీని పైకి ఎత్తలేకపోయాయి. చాలా సేపు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరీ ఎక్కువగా ప్రయత్నిస్తే స్పార్క్‌లు వచ్చే ప్రమాదం ముందని భావించిన అధికారులు ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. వాటిని వెనక్కి పంపించి వేసిన తరువాత విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి ఒక్కొక్కటీ 14 టన్నుల సామర్థ్యం ఉన్న నాలుగు క్రేన్లను రప్పించి ట్యాంకర్ పైకి లేపారు. ట్యాంకర్‌నుపైకి లేపే సమయంలో జరగరానిది జరగుతుందేమోనని అధికారులు భయపడ్డారు. రాత్రి 7 గంటలకు ట్యాంకర్‌ను యథాతధ స్థితిలోకి తీసుకు వచ్చిన అక్కడ నుంచి కొంతదూరం తరలించారు.
తప్పిన పెను ప్రమాదం..
ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాత్రి సమయాల్లో ఎవరైన కాల్చిన సిగరేటు, నిప్పురవ్వలు లాంటికి వేస్తే ట్యాంక్ పేలి పెను ప్రమాదం సంభవించేది. అంతేగాకుండా ట్యాంకర్ లారీ బోల్తాపడిన ప్రాంతం మీదుగా మంగళవారం ఉదయం 9 వరకు అనేక వాహనాలు ప్ర యాణించాయి. వాటి నుంచి వచ్చిన నిప్పురవ్వలకు బోల్తాపడిన ట్యాంకర్ పేలితేకిలోమీటర్ వరకు తీవ్రంగా, ఐదు కిలోమీటర్ల సాధారణంగా దీని ప్రభావం ఉండేదని అగ్నిమాపక అధికారులు తెలిపారు.