
విడిపోయిన రాష్ట్రంలో ఇల్లెందుకు కట్టారు?
చంద్రబాబు అధికారం చేపట్టి మూడేళ్లయినా ఒక్క పేద వాడి కూడా ఇల్లు కట్టలేదు.
చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా ప్రశ్న
ఇంటి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
ఆయన అధికారంలోకి ఎప్పుడు వచ్చినా వరుస కరువే
తిరుమల:‘‘చంద్రబాబు అధికారం చేపట్టి మూడేళ్లయినా ఒక్క పేద వాడి కూడా ఇల్లు కట్టలేదు. పేద, బడుగు వర్గాలు నిలువ నీడలేక దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. ఇలాంటి తరుణంలో విడిపోయిన రాష్ట్రంలో విలాసవంతమైన బహుళ అంతస్తుల భవంతిని చంద్రబాబు నిర్మించుకున్నారు. ఏపీకి సీఎంగా ఉంటూ హైదరాబాద్‌లో ఇల్లెందుకు కట్టారో చెప్పాలి?’’ అంటూ వైఎస్సార్‌సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా డిమాండ్ చేశారు. గురువారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కనీస సౌకర్యాల్లేని అమరావతికి అందరినీ బెదిరించి రప్పించారని, అయితే, సాక్షాత్తు సీఎం తిరిగి హైదరాబాద్‌లో కొత్త భవంతి నిర్మించడంలో ఆంతర్యమేమన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే ఉద్దేశంతోనే ముందు జాగ్రత్తగా ఇల్లు నిర్మించుకున్నారన్నారు. ఏటా రూ.33 లక్షల మాత్రం ఆదాయం లభిస్తోందనీ, తన చేతికి వాచీ, ఉంగరాలు కూడా లేవని బీద ఏడుపులు ఏడ్చే చంద్రబాబుకు కోట్లాది రూపాయల ఖర్చుతో విలాసమైంతన భవంతిని ఎలా కట్టారని ఎద్దేవా చేశారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో నంబన్‌వన్ ఆస్తిపరుడు చంద్రబాబే అని ఇండియాటుడే ఇటీవలే ఓ కథనంలో వెల్లడించిందని స్పష్టం చేశారు. దేశంలోనే అతిపెద్ద అవినీతిపరుడు కూడా చంద్రబాబేనని సర్వేలు చెబుతున్నాయని రోజా గుర్తు చేశారు. ‘‘బాబు వస్తేనే జాబు వస్తుంది’’ అని ఊదరగొట్టిన ఆయన చివరకు తన కుమారుడు లోకేష్‌కి మంత్రి పదవి కట్టబెట్టి, రాష్ట్రంలోని యువతకు మొండి చేయి చూపారన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టినా కరువే ఉందని, ఈ సారి కూడా అలాంటి పరిస్థితులు ఉండటం దౌర్భాగ్యమన్నారు. అవినీతి లో కూరుకుపోయిన చంద్రబాబు తీరును ఢిల్లీ స్థాయిలో ఎండగడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి అనేక ఇళ్లు ఉన్నాయంటూ ఓర్వలేక లేనిపోని విధంగా టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేయించడం బాధాకరమన్నారు.
ప్రతిపక్ష పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన నీచమైన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. స్పీకర్ కూడా తన హోదాను మరచి తెలుగుదేశంపార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తుండం తగదన్నారు. గవర్నర్ సైతం అలాంటివారి చేత మంత్రులుగా ప్రమాణం చేయించడం బాధాకరన్నారు. నీతిమాలిన రాజకీయాలుచేసే చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని రోజా హెచ్చరించారు.