చేవెళ్లను జిల్లాకేంద్రం చేయాలని చేపట్టిన బంద్ ఆదివారం మూడోరోజూ కూడా కొనసాగింది.
- భారీగా పోలీసు బలగాల మోహరింపు
- పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం
చేవెళ్ల(రంగారెడ్డి జిల్లా)
చేవెళ్లను జిల్లాకేంద్రం చేయాలని చేపట్టిన బంద్ ఆదివారం మూడోరోజూ కూడా కొనసాగింది. వ్యాపార సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. రెండురోజులుగా చేవెళ్ల పట్టణంలోని హైదరాబాద్- బీజాపూర్ ప్రధాన రహదారి, ముంబై-బెంగళూరు జాతీయ లింకు రహదారిలో ఆందోళనకారులు వాహనాల రాకపోకలను నియంత్రించడం, అడ్డుకోవడంతో ఆదివారం పోలీసు బందోబస్తును భారీస్థాయిలో ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలవరకే జిల్లాలోని పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్ల నుంచి అదనపు బలగాలు, సిబ్బందిని రప్పించారు. అఖిలపక్షం నాయకులు, జిల్లా సాధనసమితి ఆధ్వర్యంలో పలు గ్రామాలనుంచి ఉదయం 9 గంటలకే మండల కేంద్రానికి చేరుకొని ఆందోళనను ప్రారంభించారు. మొదటగా బస్‌స్టేషన్ , మార్కెట్‌యార్డు, పోలీస్‌స్టేషన్ , శంకర్‌పల్లి చౌరస్తాలకు ర్యాలీగా వెళ్లి అక్కడక్కడ తెరిచి ఉంచిన దుకాణాలను మూసి వేయించారు. అనంతరం హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై ఉదయం నుంచి సాయంత్రం 4 గంటలవరకు రాస్తారోకో చేశారు. ఆందోళనకారులు టైర్లను రోడ్లపైకి తెచ్చి అంటించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయినా కిరోసిన్ పోసిన టైర్లను ట్రాక్టర్‌లో తెచ్చి అంటించడంతో సాయంత్రం వరకు రోడ్డుపై కాలుతూనే ఉన్నాయి. దీంతో ఆందోళనకారులకు, పోలీసులకు తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులు రోడ్డుమీదే వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. మొత్తం మీద చెవెళ్ల బంద్ మూడోరోజు కూడా విజయవంతం అయింది.