‘హాక్-ఐ’కు మరో హంగు | the updated version of the ' Hawk-Eye ' | Sakshi
Sakshi News home page

‘హాక్-ఐ’కు మరో హంగు

Published Fri, Jul 29 2016 8:17 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

the updated version of the ' Hawk-Eye '

ఆపదలో ఉన్నా... పోలీసులకు సంబంధించిన సమాచారం కావాలన్నా... వారికి ఫిర్యాదు చేయాలన్నా ఉపకరించేలా నగర పోలీసు విభాగం రూపొందించిన మొబైల్ యాప్ హాక్-ఐలో మరో హంగు చేరింది. అత్యవసర సమయాల్లో సాయం కోరడం కోసం ఏర్పాటు చేసిన వర్చువల్ బటన్ ‘ఎస్‌ఓఎస్’కు లోకేషన్ తెలుసుకునే సౌకర్యం ఏర్పాటైంది. ఈ యాప్ ద్వారా ‘డయల్-100’కు కాల్ చేసినా ఇది వర్తిస్తుంది.


ఇదీ ‘డేగ కన్ను’...
సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండటానికి, ఫిర్యాదులతో పాటు సూచనలు సలహాలు తీసుకోవడం, అవసరమైన సమాచారం అందించడంలో కోసం నగర పోలీసులు ఏర్పాటు చేసిన మొబైల్ యాప్ ‘హాక్-ఐ’. ఇప్పటి వరకు దీన్ని రెండు లక్షల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి నేరాల వరకు ఫిర్యాదు చేయవచ్చు. అవసరమైనప్పుడు పోలీసుల సాయం సైతం పొందేలా సిటీ పోలీసు ఐటీ సెల్ అధికారులు ఈ యాప్‌ను రూపొందించారు.


ఏమిటీ ఎస్‌ఓఎస్..?
నగర పోలీసు మొబైల్ యాప్ హాక్-ఐలో ఉన్న వివిధ ఆప్షన్స్‌లో ఎస్‌ఓఎస్ ఒకటి. అత్యవసర సమయాల్లో మీట నొక్కడం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఉపకరించే వర్చువల్ ఎమర్జెన్సీ బటన్ ఇది. ఈ ఆప్షన్‌లోకి ప్రవేశించిన తర్వాత వినియోగదారులు తమ పేరు, ఫోన్ నంబర్ వంటివి ఎంటర్ చెయ్యాలి. అత్యవసర సమయాల్లో ఎవరిని సంప్రదించాలని భావిస్తున్నామో వారి నంబర్లు సైతం పొందుపరచాలి. గరిష్టంగా ఐదుగురికి చెందిన సెల్‌ఫోన్ నంబర్లు ఎంటర్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దీంతో ఎమర్జెన్సీ బటన్ యాక్టివేట్ అయినట్లే. అత్యవసర సమయాల్లో దీన్ని నొక్కితే సరిపోయేలా పోలీసు విభాగం డిజైన్ చేసింది.


ఇప్పటి వరకు ఎలా పని చేస్తోంది?
ఎస్‌ఓఎస్ ఆప్షన్ ద్వారా ఈ యాప్‌లో ఓ ఎమర్జెన్సీ బటన్ క్రియేట్ అవుతుంది. వినియోగదారులు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అత్యవసరంగా సాయం పొందాలని భావించినప్పుడు ఈ బటన్ నొక్కితే చాలు... ఎంటర్ చేసిన నంబర్లతో పాటు స్థానిక ఠాణా, ఏసీపీ, డీసీపీలకు సమాచారం వెళ్తుంది. ఆయా పోలీసు అధికారులు బటన్ నొక్కిన వారిని ఫోన్‌లో సంప్రదించడం ద్వారా వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటారు. ఆపై సమీపంలో ఉన్న పోలీసు వాహనాలపై రక్షక్, బ్లూకోల్ట్స్ ఎక్కడున్నాయో పరిశీలించి వాటిని సాయం అవసరమైన వ్యక్తి ఉన్న ప్రాంతానికి పంపుతారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఈ విధానానికి బదులుగా అత్యాధునిక పరిజ్ఞానాన్ని జోడించారు. శుక్రవారం నుంచి ఇది ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది.


ఇకపై ఎలా పని చేస్తుంది?
ఈ ‘హాక్-ఐ’ యాప్‌ను నగర పోలీసు ఐటీ సెల్ జీపీఎస్ పరిజ్ఞానంతో అనుసంధానింది. ఇలా చేయడంతో ఇకపై ఎవరైనా ఎస్‌ఓఎస్ బటన్ నొక్కితే వారు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్నీ తెలుసుకునే అవకాశం ఏర్పడింది. నగరంలోని ఐదు జోన్లలో ఉన్న జోనల్ కంట్రోల్ రూమ్స్‌తో పాటు ప్రధాన కంట్రోల్‌రూమ్, హాక్-ఐ కంట్రోల్ రూమ్స్‌లో పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎస్‌ఓఎస్ నొక్కిన వెంటనే వీటిపై ఉండే నగర మ్యాప్‌లో బాధితుడు ఏ ప్రాంతంలో ఉన్నారనేది ‘హాక్-ఐ’ మార్క్‌లోనే కనిపించడంతో పాటు ప్రత్యేక సైరన్ వస్తుంది. ఎస్‌ఓఎస్ నొక్కిన తర్వాత బాధితుడు ఎటైనా సంచరిస్తున్నా... ఫిర్యాదు క్లోజ్ అయ్యే వరకు తెరపై ఆ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ‘హాక్-ఐ’ మార్క్‌ను క్లిక్ చేస్తే బాధితుల పేరు, ఫోన్ నెంబర్ డిస్‌ప్లే అవుతాయి. ఆ సమీపంలోని రక్షక్ వాహనం సైతం కనిపించడంతో దానికి ఆ సమాచారం ఇచ్చి వెంటనే బాధితుడు ఉన్న ప్రాంతానికి మళ్ళిస్తారు.


‘వందకూ’ వర్తింపు...
హాక్-ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్-100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా ‘100’ డయల్ చేసి కాకుండా ఈ యాప్ ద్వారానూ సంప్రదించే ఆస్కారం ఏర్పడింది. హాక్-ఐ ద్వారా కాల్ చేస్తే... ఆ ఫిర్యాదుదారుల లోకేషన్ సైతం ఎస్‌ఓఎస్ వినియోగించిన వారి మాదిరిగానే కంట్రోల్ రూమ్స్‌లో స్క్రీన్స్‌పై కనిపించేలా సిటీ పోలీసు ఐటీ సెల్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న దీన్ని వినియోగంలో వచ్చే ఇబ్బందుల్ని గమనించడం ద్వారా అవసరమైన మార్పుచేర్పులు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ‘హాక్-ఐ’ యాప్ నగర పోలీసులకు అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement