
కదిరిలో దొంగలు పడ్డారు!
- 30 తులాల బంగారు, 71 తులాల వెండి ఆభరణాల చోరీ
- రంగంలోకి జాగిలాలు, క్లూస్ టీం
కదిరి టౌన్ : కదిరిలో దొంగలు పడ్డారు. భారీగా నగలు, నగదుతో ఉడాయించారు. ఇంట్లో మనుషులు ఉండగానే దుండగులు దోపిడీకి పాల్పడటం గమనార్హం. కదిరి ఆర్టీసీ బస్టాండు సమీపంలోని అమీన్‌నగర్‌లో నివాసముంటున్న వెలుగు కార్యాలయం టెక్నికల్ అసిస్టెంట్ నాసిర్‌వలి ఇంట్లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఉక్కపోత భరించలేక నాసిర్ తన కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం రాత్రి మిద్దెపై పడుకున్నారు. కింద అంతస్తులో తన తల్లి, కుమారుడు ఇద్దరూ నిద్రపోయారు. వారిటికి ఆనుకుని ఉన్న సుంకేసుల చెట్టుపై నుంచి రెండో అంతస్తులోకి వెళ్లిన దొంగలు.. కాస్త తెరచి ఉంచిన ఇనుపగ్రిల్‌ను తొలగించి లోపలికి చొరబడ్డారు. పడక గదిలోని బీరువాలను పగులగొట్టి బంగారు హారం, నెక్లెస్, నల్లపూసల దండ, పది జతల కమ్మలు, ఉంగరాలన్నీ కలిపి మొత్తం 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు 71 తులాల వెండి గొలుసులు, రూ.4 వేల నగదు, నాలుగు వాచీలు, ఒక సెల్‌ఫోన్, ఒక కెమెరాను ఎత్తుకెళ్లారు.
అయితే ఎక్కడా ఎలాంటి శబ్ధం లేకుండా జాగ్రత్తగా తమ పని కానిచ్చారు. తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబీకులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ వెంకట రామాంజనేయులు, సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐలు రాజేశ్, గోపాలుడు తమ సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనపై ఆరా తీశారు. జాగిలాలు, వేలిముద్రల నిపుణులను రప్పించి దర్యాప్తు చేపట్టారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.