ఓ చోరి కేసులో పోలీసులు రికవరీ చేసి స్టేషన్‌లో ఉంచిన రెండు ట్రాక్టర్ టైర్లను అదే స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న వ్యక్తి దొంగతనంగా ఎత్తుకెళ్లి అమ్ముకున్న సంఘటన పట్టణ పోలీస్ స్టేషన్‌లో జరిగింది
కోదాడ: ఓ చోరి కేసులో పోలీసులు రికవరీ చేసి స్టేషన్‌లో ఉంచిన రెండు ట్రాక్టర్ టైర్లను అదే స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్న వ్యక్తి దొంగతనంగా ఎత్తుకెళ్లి అమ్ముకున్న సంఘటన పట్టణ పోలీస్ స్టేషన్‌లో జరిగింది. దొంగతనం చేసిన హోంగార్డు ప్రభాకర్‌తో పాటు అతనికి సాయం చేసిన ముగ్గురిని సోమవారం పట్టణ సీఐ రజితారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లికి చెందిన ప్రభాకర్ కోదాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. స్టేషన్‌కు దూరంగా ఉంచిన టైర్లను చూసిన హోంగార్డు అదే రోజు వీటిపై కన్నెశాడు. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో పోలీస్ క్వార్టర్స్ వెనుక నుంచి దొంగతనంగా ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడు. వీటి విలువ సుమారు రూ. 50 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. చోరి జరిగిన విషయాన్ని గమనించిన పట్టణ సీఐ, ఎస్‌ఐలు విషయాన్ని సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చెయ్యడంతో హోంగార్డు నిర్వాహకం బయటపడింది. దీంతో హోంగార్డు ప్రభాకర్‌తో పాటు అతనికి సాయం చేసిన వారిని పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఇదీలా ఉండగా ఈ వ్యవహారంలో మరో హెడ్ కానిస్టేబుల్ పాత్ర కూడ ఉందని, కావాలనే అతన్ని తప్పించారనే ఆరోపణలు కూడ వినిపిస్తున్నాయి. పట్టణ సీఐ రజితారెడ్డి మాత్రం ఈ వ్యవహారంలో కేవలం హోంగార్డు మాత్రమే పాల్గొన్నాడని, డిపార్టుమెంట్‌కు సంబంధించి మరెవ్వరికి సంబంధం లేదని స్పష్టం చేశారు.