పట్టపగలు చోరీ
నిజాంసాగర్ : తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. పగలు, రాత్రి అన్నతేడాలు లేకుండా దొంగతనాలు చేస్తూ దొంగలు రెచ్చి పోతున్నారు. నిజాంసాగర్ మండలం వడ్డేపల్లిలోని ఓ ఇంట్లో పట్టపగలు చోరీ జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. వడ్డేపల్లికి చెందిన శైనొద్దీన్ బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబీకులతో కలిసి బాన్సువాడకు వెళ్లారు. గ్రామస్తులు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు గ్రామ శివారులోకి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దొంగలు పట్టపగలు శైనొద్దీన్ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. గదుల్లో ఉన్న బీరువాలు, సుట్‌కేసులను పగులగొట్టారు. అందులో దాచిఉంచిన రూ. 90 వేల నగదు, 4 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకు వెళ్లారు. అయితే చోరీకి పాల్పడగా లభించిన నగదు, బంగారాన్ని గ్రామ శివారులోని పంటపొలాల్లో పంచుకున్నారు. అదే సమయంలో హరితహారం పనులు ముగించుకొని ఇళ్లకు వస్తున్న గ్రామస్తులకు పంటపొలాల గట్ల కింద దాగి ఉన్న మహిళలు, పురుషులు కంటపడ్డారు. అప్పటికే శైనొద్దీన్ ఇంట్లో దొంగతనం జరిగిన విషయం గ్రామస్తులకు తెలిసింది. గ్రామశివారులోని పంటపొలాల్లో దాగి ఉన్న దొంగలను గ్రామస్తులు చుట్టిముట్టి పట్టుకున్నారు. దొంగతనానికి పాల్పడిన నలుగురు మహిళలతో పాటు ఒక దొంగను పట్టుకున్నారు. అప్పటికే నగదు, బంగారాన్ని పంచుకున్న మహిళలు సదరు నగదు, బంగారాన్ని దాచుకున్నారు. గ్రామశివారులో పట్టుబడిన దొంగలను కొట్టుకుంటూ గ్రామ పంచాయతీకి కార్యాలయానికి తీసుకువచ్చారు. అప్పటికే ఒక దొంగ కొంత నగదుతో పరారవడంతో నలుగురు మహిళలు, మరో దొంగను గ్రామస్తులకు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు బాన్సువాడ రూరల్ సీఐ రమణారెడ్డి ఆధ్వర్యంలో దొంగలను విచారిస్తున్నారు. దొంగలను పట్టుకున్న గ్రామస్తులను సర్పంచ్ గోడాల రేఖారాము అభినందించారు.