రాయకుదురులో భారీ చోరీ
రాయకుదురులో భారీ చోరీ
Published Tue, Mar 21 2017 1:50 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM
వీరవాసరం: మనవరాలి పెళ్లిచూపుల కోసం బ్యాంకులో తాకట్టుగా ఉన్న బంగారు ఆభరణాలు తీసుకురాగా చోరీ జరిగింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. వివరాలిలా ఉన్నాయి.. వీరవాసరం మండలం రాయకుదురు గ్రామానికి చెందిన చింతపల్లి వెంకటేశ్వరరావు దంపతులు ఊరు శివారున గొంతేరు డ్రెయిన్ సమీపంలో కూల్‌డ్రింక్స్ దుకాణం నడుపుకుంటూ కుమార్తెతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి వెంకటేశ్వరరావు దంపతులు రాయకుదురు గ్రామంలో ఉన్న కుమారుడు నాగరాజు ఇంటికి నిద్రించేందుకు వెళ్లారు. ఇదే అదనుగా గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప ఊసతో వెంకటేశ్వరరావు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 16 కాసుల బంగారం, 12 తులాల వెండి వస్తువులు, రూ.25 వేల నగదుతో పాటు కూల్‌డ్రింక్స్ దుకాణంలో వస్తువులను అపహరించారు. ఉదయం ఇంటికి వచ్చిన వెంకటేశ్వరరావు చోరీ జరిగిందని కన్నీరుమున్నీరయ్యాడు. మనవరాలు పెళ్లిచూపులకని బ్యాంకు తాకట్టులో ఉన్న ఆభరణాలను అప్పు చేసి విడిపించానని, ఒకటి రెండు రోజుల్లో మరలా బ్యాంకులో తాకట్టుపెట్టి అప్పు తీర్చేద్దామనుకున్నానని బోరుమన్నాడు. కష్టార్జితం దొంగలు దోచుకుపోయారంటూ విలపించాడు. వెంకటేశ్వరరావు కుమార్తె చింతపల్లి బేబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. సంఘటనా ప్రాంతాన్ని పాలకొల్లు రూరల్ సీఐ చంద్రశేఖర్‌తోపాటు క్లూస్ టీం సిబ్బంది పరిశీలించి వేలిముద్రలు సేకరించారు.
Advertisement