
ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు
కడప కల్చరల్ :
జీవితం దేవుడిచ్చిన వరం అంటారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వీలైతే మరో నలుగురికి ఉపయోగపడాలని పెద్దలు సూచించారు. కానీ పెంచుకున్న ఆశలు కరిగిపోయినపుడు నిరాశ, నిస్పృహలకు లోనై విలువైన జీవితాలకు మధ్యలోనే చరమగీతం పాడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఆత్మహత్యల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక సమస్యలతో కొందరు, ప్రకృతి కరుణించక కరువు కాటుతో మరికొందరు, కుటుంబ కలహాలు తదితర కారణాలతో ఇంకొందరు జీవితాన్ని బలవంతంగా ముగిస్తున్నారు. చచ్చి సాధించేది ఏమి ఉండదని, బతికి సమస్యలను ఎదుర్కొని ఓడించినపుడే నలుగురికి ఆ జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రముఖ మనస్తత్వ శాస్త్ర నిపుణుడు ఓ.వెంకటేశ్వరరెడ్డి పేర్కొంటున్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఆయనతోl‘సాక్షి’ ఇంటర్వ్యూ...
సాక్షి : ఆత్మహత్యలు సాధారణంగా ఎందుకు చేసుకుంటారు?
ఓవీ రెడ్డి : కోరికలు నెరవేరలేదని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అనుకున్నది సాధించలేక పోతున్నామని, అవమానాలకు గురవుతున్నామని భావించేవారు, బలహీనమైన మనసు గల వారు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.
సాక్షి : అది ఆవేశమేనా?
ఓవీ రెడ్డి : ఇలాంటి వారు మానసికంగా చాలా ఉద్వేగంగా ఉంటారు. మరణమే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారమన్న భావనతో ఉంటారు. సమస్యను రెండవ కోణం నుంచి చూసేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయరు. పైగా క్షణ క్షణం కసిని పెంచుకుంటారు. ఆ భావోద్వేగమే వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతుంది.
సాక్షి : యువతలోనే ఎక్కువ..? ఎందుకు..?
ఓవీ రెడ్డి : జీవితాన్ని పూర్తిగా చూసి ఉండరు గనుక యువతలో ఆత్మహత్యలు ఎక్కువ. పెద్దలను ఎదిరించడం గొప్పగా భావించి తమకు అన్నీ తెలుసనే భావనతో ఉంటారు. తమ నిజమైన శ్రేయోభిలాషులెవరో నిర్ణయించుకోలేని ఊగిసలాటలో ఉంటారు. తాము వెళ్లే దారి మంచిదో కాదో కూడా తెలుసుకునే అనుభవం ఉండదు. అందుకే సమస్యలు వస్తే మరణమే పరిష్కారమని భావిస్తారు.
సాక్షి : యువతలో ఈ ఆలోచన మాన్పలేమా?
ఓవీ రెడ్డి : తప్పకుండా మాన్పించవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. ఎదిగిన పిల్లలతో స్నేహితుల్లా ఉండాలి. సానుకూల దృక్పథాన్ని, సమస్యను విభిన్న కోణాల్లో విశ్లేషించే గుణాన్ని పెంచాలి. పిల్లల సమస్యల పరిష్కారంలో వారి స్నేహితులకు భాగస్వామ్యం కల్పించాలి. సమస్యల పాలైన పిల్లలపై కోప్పడితే.. సమస్య మరింతగా పెరిగి వారిలో మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది.
సాక్షి : ప్రేమ ఆత్మహత్యల మాటేమిటి?
ఓవీ రెడ్డి : తల్లిదండ్రులు, పిల్లల మధ్య మానసిక దూరమే నూతన వ్యక్తుల అభిమానం పొందాలన్న కాంక్షను కలిగిస్తుంది. యువతలో భౌతిక ఆకర్షణ ఎక్కువ. అందుకే నిండైన జీవితాన్ని ప్రాక్టికల్‌గా చూసే స్థితి ఉండదు. తమ నిర్ణయంపై విమర్శను అవమానంగా భావిస్తారు. తమ నిర్ణయమే సరైనదన్న మూర్ఖత్వం తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తోంది. అలాంటి వారికి ప్రేమతోపాటు ఎంతో బతుకు ఉందని, ఎన్నో కోణాలలో సమాజంలోని ఎందరికో తమ ప్రేమను పంచాల్సిన బాధ్యత ఉందన్న అవగాహన కల్పించాలి.
సాక్షి : రైతు ఆత్మహత్యల సంగతేమిటి? నివారించడం కష్టమా?
ఓవీ రెడ్డి : దీన్మి సామాజిక సమస్యగా భావించాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో వ్యక్తి కంటే వ్యవస్థ ప్రభావమే ఎక్కువ. రైతుల్లో ఎక్కువగా పంట నష్టాలే ఆత్మహత్యలకు పురి గొల్పుతుంటాయి. వారికి ప్రభుత్వం సామాజిక భద్రత కల్పిస్తే గణనీయంగా తగ్గుతాయి. ఆత్మహత్య శాశ్వత పరిష్కారం కాదని వారు గ్రహించాలి. అలాంటి ధోరణిని వారిలో గమనిస్తే ఆత్మీయులు, కుటుంబ సభ్యులు సమస్య నుంచి ఆలోచనను మళ్లించాలి.